అదుపుతప్పి పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి
ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
నాగర్ కర్నూల్, ఆగస్టు 23 ( విజయక్రాంతి): అదుపుతప్పి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయనోనిపల్లి గ్రామానికి చెందిన వధువు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు నాగర్ కర్నూల్ మండలం నాగనూలు గ్రామంలోని వరుడి ఇంటి వద్ద జరిగిన వివాహానికి ట్రాక్టర్‌పై వెళ్లారు.
వివాహం అనంతరం తిరుగు ప్రయాణంలో నక్కలపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాయనోనిపల్లి గ్రామానికి చెందిన పెద్ద చిన్నయ్య (70) అక్కడికక్కడే మృతిచెందారు. జ్యోతి, సరిత, బుడుగు లింగస్వామి, జంగం నిరంజనమ్మ, మద్దటి అలివేల, చింతకుంట భాగ్యమ్మ, బుడుగు బాలపీరు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రులను నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.






