మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టితో కమాన్‌పూర్‌కు కొత్త రూపు
రేపు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం
కమాన్‌పూర్, ఆగస్టు 23(విజయ క్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టితో కమాన్‌పూర్ మండలం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు సాకారం అవుతున్నాయి. ఇందులో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు రేపు సోమవారం కమాన్‌పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11.30 గంటలకు మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం ఆదివరాహ స్వామి దేవాలయానికి రూ.95 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభిస్తారు. అలాగే కమాన్‌పూర్ గ్రామంలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈజీఎస్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
గుండారం గ్రామం నుంచి రాజాపూర్ మీదుగా మంగపేట వరకు రూ.3.05 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆదివరాహ స్వామి జయంతి వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారు. అభివృద్ధికి పెద్దపీట.. మారుతున్న కమాన్‌పూర్ రూపురేఖలు మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో కమాన్‌పూర్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు, రహదారులు, వంతెనలు, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం లభిస్తోందని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నూతన భవనాలు, అభివృద్ధి పనులతో “కమాన్‌పూర్ కల” క్రమంగా సాకారం అవుతోందని పేర్కొన్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కమాన్‌పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.ఎస్. అన్వర్ పిలుపునిచ్చారు.






