పాత బావి పూడ్చి అంగన్‌వాడీ, పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి
సారపాక 4వ వార్డు ప్రజల డిమాండ్
బూర్గంపాడు,(విజయక్రాంతి): సారపాక పారిశ్రామిక ప్రాంతంలోని 4వ వార్డులో వినియోగంలో లేని పాత తాగునీటి బావిని పూడ్చివేసి, ఆ స్థలంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని వార్డు ప్రజలు కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో కలిసి ఐటీసీ యాజమాన్యం, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు.సుమారు 45 ఏళ్ల క్రితం ఐటీసీ పీఎస్పీడీ నిర్మించిన తాగునీటి బావి ప్రస్తుతం వినియోగంలో లేదని తెలిపారు.
బావిలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి, పరిసర ప్రాంత ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బావిని పూడ్చివేసి, ఆ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.అదే ప్రదేశంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తే మహిళలు, చిన్నారులు, వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ మేరకు ఐటీసీ యాజమాన్యంతో పాటు స్థానిక సర్పంచ్‌కు వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు కొనకంచి శ్రీను, బానోతు శ్రీను, బీజేపీ నాయకుడు చుక్కపల్లి బాలాజీతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.






