జిల్లాలో ప్రభుత్వ సేవల నాణ్యతే లక్ష్యం
ఆగస్టు 1 నుంచి కమాన్‌పూర్ నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభించాలి
విద్య, వైద్యం, ఓటరు నమోదు, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృత పర్యటన
పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం ఆయన కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, విద్య, వైద్యం, ఓటరు నమోదు, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
పాఠశాలలు, జూనియర్ కళాశాల తనిఖీ
పర్యటనలో భాగంగా గుండారం ఎంపీపీఎస్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించడంతో పాటు, ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు పెంపొందించేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కమాన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించి విద్యా ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులపై సమీక్షించారు.
ఆగస్టు 1 నుంచి నూతన తహసీల్దార్ కార్యాలయం
కమాన్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మిగిలిన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, 2026 ఆగస్టు 1 నాటికి నూతన భవనం నుంచే పాలనా సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రామగిరి మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన తహసీల్దార్ కార్యాలయ పనులను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.
సింగరేణి భూ వివాదాల పరిష్కారానికి సమగ్ర సర్వే
పెంచికల్‌పేట్ గ్రామంలోని సింగరేణి భూములను పరిశీలించిన కలెక్టర్, భూ వివాదాల పరిష్కారం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ (ల్యాండ్ సర్వే) ఆధ్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టాలని సూచించారు. రామగిరి మండలం మేడిపల్లి గ్రామ శివారులో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని పరిశీలించి, ఫెన్సింగ్ మరియు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వైద్య సేవలు, ఓటరు నమోదు వేగవంతం
కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, లేబర్ రూమ్, వ్యాక్సినేషన్ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఓపీ సంఖ్యను పెంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణ
సీజనల్ వ్యాధులు నియంత్రణ లో స్టాప్ డయేరియా, ఎన్ సి డి ప్రోగ్రామ్‌లను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అనంతరం కమాన్‌పూర్ మండలంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను కచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో కమాన్‌పూర్ తహసీల్దార్ వాసంతి, రామగిరి తహసీల్దార్ సుమన్, ఎంపీడీఓ శైలజారాణి, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈలు వరలక్ష్మి, జగదీశ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.






