22 June, 2026 | 3:03 AM

సులువుగా జీవశాస్త్ర ప్రశ్నలు

22-06-2026 01:34 AM
  1. రసాయన, భౌతిక శాస్త్ర ప్రశ్నలపై మిశ్రమ స్పందన
  2. మునపటి పరీక్ష కంటే టఫ్ అన్న విద్యార్థులు
  3. దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ ప్రశాంతం
  4. హైదరాబాద్‌లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థి అరెస్ట్
  5. బాత్‌రూమ్‌లో ఫోన్ దాచి, కడుపు నొప్పి వస్తుందని వెళ్లి..
  6. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఇన్విజిలెటర్లు
  7. యూపీలో లోదుస్తుల్లో సిమ్‌కార్డు.. పాతప్రశ్నాపత్రం.. ఒకరి అరెస్ట్
  8. బీహార్‌లో ఒకరి బదులు మరొకరు.. 9 మంది అరెస్ట్
  9. నీట్ విద్యార్థుల కోసం.. ఎయిర్‌పోర్ట్‌లో ఆగిన మోదీ

న్యూఢిల్లీ, జూన్ 21: దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ పరీక్షలో జీవశాస్త్ర ప్రశ్నలు సులభంగా వచ్చా యని అభిప్రాయపడ్డ విద్యార్థులు.. రసాయన, భౌతికశాస్త్రాల ప్రశ్నలపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే మునపటి పరీక్ష కంటే ఈ సారి పరీక్షా పత్రం టఫ్‌గానే ఉందన్నారు. దేశవ్యాప్తంగా చిన్నచిన్న ఘటనలు మినహా నీట్ రీఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది.

హైదరాబాద్ పరిధిలోని ఓ కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడి న విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. కడుపునొప్పి వస్తోందని.. బాత్‌రూమ్‌కు వెళ్లి, సెల్‌ఫోన్‌లో సమాధానాలు వెతుకుతున్న అతన్ని ఇన్విజిలెటర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలా గే ఉత్తరప్రదేశ్‌లో లోదుస్తుల్లో సిమ్‌కార్డు.. పాతప్రశ్నాపత్రం తెచ్చుకున్న ఒకరిని, బీహార్‌లో ఒకరి బదులు మరొకరు హాజరైన ఘటనలో 9మంది అభ్యర్థులను అరెస్ట్ చేశారు. ఈసారి అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు, నిఘా ఏర్పాటు చేశారు. తనవల్ల నీట్ విద్యార్థులకు ట్రాఫిక్ సమస్యలు రాకూడదని భావించిన ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు.

పరీక్ష మొదలైన తర్వాతే విమానాశ్రయం నుంచి తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. గతంలో మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో ఈ -ఎగ్జామ్‌ను మళ్లీ నిర్వహించారు. ఎన్టీఏ ఆధ్వర్యంలో భారతదేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలలో, విదేశాలలో 14 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహిం చారు. ఈ పునఃపరీక్షకు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు అయినట్లు సమాచారం.

ఈ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరిగింది. అదనపు సమయం పొందేందుకు అర్హత ఉన్న దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం సాయంత్రం 6.20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. పరీక్ష ముగిసిన తర్వాత కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పేపర్‌పై స్పందించారు. మే 3న జరిగిన పరీక్షతో పోలిస్తే ఈసారి పేపర్ చాలా లెంగ్తీగా, కష్టంగా ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఫిజి క్స్, కెమిస్ట్రీ విభాగాలు కష్టంగా వచ్చాయని. బయోలాజీ విభాగం చాలా లెంగ్తీగా ఉందని విద్యార్థులు చెప్పారు.

రీ-ఎగ్జామ్ పేపర్‌లో రెండు మూడు ప్రశ్నలు పాత పరీక్ష ప్రశ్నల నుంచి వచ్చినట్లు కొంతమంది పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే పేపర్ కష్టంగానే ఉందని చెప్పారు. ఎన్టీఏ ఆఫీసు నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఈ ఏర్పాట్లను సమీక్షించారు. తెలంగాణలో నీట్‌ప్రశాంతంగా జరిగింది. పలుచోట్లు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన ౧౦ మందిని అనుమతించలేదు. బాగ్‌లింగంపల్లి కేంద్రానికి ఓ విద్యార్థిని, కోఠిలోని కేంద్రానికి నలుగురు, సోమాజిగూడ లోని కేంద్రానికి ముగ్గురు, సికింద్రాబాద్‌లో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. 

నీట్ విద్యార్థుల కోసం.. ఎయిర్‌పోర్ట్‌లోనే ఆగిన మోదీ 

నీట్ పరీక్ష రాసే విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రయాణాన్ని  కొద్దిసేపు వాయిదా వేసుకున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమై ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా తన అధికారిక నివాసానికి వెళ్లాల్సి ఉంది.

అయితే మధ్యాహ్నం రెండు గంటలకు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకునే హడావిడిలో ఉంటారు. ఈ తరుణంలో తన వీఐపీ కాన్వాయ్ రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ నిలిచిపోయి, విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకోలేరని ప్రధాని భావించారు. అందుకే ఎగ్జామ్ మొదలయ్యే వరకు విమానాశ్రయం వెలుపలికి రాకూడదని స్వయంగా నిర్ణయించుకున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాతే ఎయిర్‌ఫోర్ట్ నుంచి తన నివాసానికి వెళ్లారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాల్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. 

మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థి అరెస్ట్ 

హైదరాబాద్ శివార్‌లోని ఆదిభట్లలోని రాగన్నగూడ జెడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రంలో నీట్ పరీక్ష రాస్తూ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆదివారం ఉదయం 7 గంటలకే కేంద్రానికి చేరుకుని, పక్కా ప్లాన్ అమలు చేశాడు. తన మొబైల్ ఫోన్‌ను ఒక జిప్‌లాక్ కవర్‌లో పెట్టి, వాస్‌రూమ్‌లోని ఫ్లష్ ట్యాంక్ వెనుక వెంటిలేటర్‌లో చాకచక్యంగా దాచిపెట్టాడు. అందరిలాగే  కేంద్రం ఎంట్రీ వద్ద భద్రతా సిబ్బంది తనఖీల తర్వాత లోపలికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సదరు విద్యార్థి తనకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తోందని ఇన్విజిలేటర్లను నమ్మించి, బాత్‌రూమ్‌కు వెళ్లాడు.

ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఇన్విజిలేటర్లు లోపలికి వెళ్లగా, సదరు విద్యార్థి మొబైల్ ఫోన్ తీసి, గూగుల్ క్రోమ్ ద్వారా నీట్ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఓ అభ్యర్థి తన లోదుస్తుల్లో సిమ్‌కార్డు, నీట్ పాత ప్రశ్నాపత్రంతో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో పరీక్ష రాసేందుకు ఒకరి బదులు మరొకరు వచ్చారన్న ఆరోపణలపై 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న దాదాపు 12 మంది అనుమానితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. 

హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షకు 67 ఏళ్ల వృద్ధుడు హాజరై అందరినీ ఆశ్యర్యానికి గురిచేశాడు. అతడి పేరు ఎల్ కే డేవిడ్. ఢిల్లీలో టెలి కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు.  దాని తర్వాత ఫిజియోథెరపీ రెండు సంవత్సరాల కోర్స్ పూర్తిచేసి తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఉద్యోగం చేశాడు. ఆదివారం రెండోసారి నీట్ పరీక్ష రాసేందుకు హాజరై యువతకు ఆదర్శంగా నిలిచాడు.