యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం
చర్ల ప్రభుత్వ కళాశాలలో సాధకులు
చర్ల,(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఆదివారం చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగ ట్రైనర్లు మల్లాది శ్రీరామ్మూర్తి, కీర్తి సురేష్ హాజరై విద్యార్థులు, గ్రామ ప్రజలకు యోగ సాధన చేయించారు. శరీర సంచాలన్, సూర్యనమస్కారాలు, తాడాసన, అర్ధ చక్రాసన, అర్ధకటి చక్రాసనతో పాటు కపాలభాతి, భస్త్రిక, ఉజ్జాయి, నాడిశోధన, భ్రమరి ప్రాణాయామాలు, ఓంకార ధ్యానం చేయించారు. అనంతరం యోగా ఆధారిత కొన్ని వినోదాత్మక ఆటలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లాది శ్రీరామ్మూర్తి, కీర్తి సురేష్ మాట్లాడుతూ యోగ అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, శ్వాస, మనసు, ఆత్మను సమతుల్యంగా ఉంచే సంపూర్ణ జీవన విధానమని అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. నేటి వేగవంతమైన జీవితంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా అత్యుత్తమ పరిష్కార మార్గమని సూచించారు.






