ఐటమ్ సాంగ్‌పై అభ్యంతరాలు!
కన్నడ హీరో ధ్రువ్ సర్జా నటించిన తాజా చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ప్రేమ్స్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో రీష్మా కథానాయిక. సంజయ్ దత్, శిల్పాశెట్టి, నోరా ఫతేహి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నోరా ఫతేహీ, సంజయ్ దత్‌పై చిత్రీకరించిన ఈ సినిమాలోని ఓ పాటను చిత్రబృందం ఇటీవల రిలీజ్ చేసింది. ఈ గీతానికి తెలుగులో చంద్రబోస్ రాసిన సాహిత్యం సరళంగా, వినసొంపుగా ఉందనే అభిప్రాయాన్ని సంగీత ప్రియులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, హిందీ సాహిత్యం వివాదాస్పదంగా మారింది. హిందీలో ఈ పాటను రాకీబ్ ఆలమ్ రాయగా, అర్జున్ జన్య స్వరకల్పనలో మంగ్లీ ఆలపించింది. ఈ సాహిత్యంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటలో మాస్ బీట్స్‌తో రాజు సుందరం కంపోజ్ చేసిన స్టెప్పులు, తెరకెక్కించిన విధానం కూడా చర్చనీయాంశమైంది. దీంతో ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కేంద్రం అన్ని వేదికల్లోనూ ఈ పాటను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ను ఆదేశించింది.
పొడుపు కథకు శృంగార భావాలు అద్ది..
ఈ పాట హిందీ పదాలను గమనిస్తే.. ‘పహ్లే ఉఠాలే.. అందర్ వో డాలే.. నీచే ఏక్ బుంద్ నా గిరాయే.. కర్కే నికాలే ఖాళీ.. ముఝ్ పే గిరేనా లగ్తా హై డర్..’ అంటూ పూర్తిగా ద్వందార్థం ఉట్టిపేడేలా సాగుతోంది.
ఈ పదాలను తెలుగులో పరిశీలిస్తే.. పహ్లే ఉఠాలే (మొదట పైకి లేపు), అందర్ వో డాలే (దాన్ని లోపల వెయ్), నీచే ఏక్ బుంద్ నా గిరాయే (కింద ఒక్క చుక్క కూడా పడనీయవద్దు), కర్కే నికాలే ఖాళీ (ఖాళీ చేసి బయటకు తీయ్), ముఝ్ పే గిరేనా లగ్తా హై డర్ (నా మీద పడుతుందేమో అని భయంగా ఉంది) అని అర్థం వస్తుంది. సాధారణంగా ఇది ‘ఒక గ్లాసుతో నీళ్లు తాగడం’ లేదా ‘కొబ్బరి బోండాం నీళ్లు తాగడం’ గురించి చెప్పే సరదా పొడుపు కథ. గ్లాసును లేదా బోండాన్ని పైకి ఎత్తుతాం (పహ్లే ఉఠాలే).
నోట్లో నీళ్లు పోసుకుంటాం (అందర్ వో డాలే). ఒక్క చుక్క కూడా కింద పడకుండా జాగ్రత్త పడతాం (నీచే ఏక్ బుంద్ నా గిరాయే). నీళ్లు తాగేసి ఖాళీ గ్లాసు/బోండాంను పక్కన పెడతాం (కర్కే నికాలే ఖాళీ). బట్టల మీద పడుతుందేమోననే భయం (ముఝ్ పే గిరేనా) ఉంటుంది. ఈ పొడుపు కథను కాస్తా శృంగార భావాలను అద్ది ఈ పాటను తీర్చిదిద్దడమే వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ జాబితాలోకి వెళ్లింది.




