12 March, 2026 | 7:27 AM

ఒరిగిందేమిటి?

12-03-2026 01:53 AM

నెలల తరబడి విచారణ.. చివరకు అనుకున్నదే అయింది

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ తీర్పుపై అభ్యంతరాలు

ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ రాజకీయాలకు లోబడి నిర్ణయాలు

ప్రభుత్వాలు మారినా సాధ్యం కానీ ఫిరాయింపుల నియంత్రణ

ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని హెచ్చరిస్తున్న విశ్లేషకులు

ప్రజాప్రతినిధుల తీరుపై వెలువెత్తుతున్న ప్రజాగ్రహం

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహ రి ఫిరాయింపుల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మొ త్తం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా.. ఇందులో ఇప్పటికే 8 మందికి స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరి అంశంలో స్పీకర్ తీర్పు ఆసక్తికరంగా మారింది.

నెలల తరబడి సాగిన విచారణ అనంతరం స్పీకర్ వారిద్దరు కూడా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారంటూ ఇచ్చిన తీర్పు తీవ్ర విమర్శలకు దారితీసింది. విచారణ ప్రక్రి య ఎంతో కాలం సాగినా చివరకు ముందే ఊహించిన ఫలితమే వచ్చిందన్న అభిప్రా యం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన చోట వాటిని తప్పించారని ఆరోపిస్తున్నాయి.

ఒక పార్టీ తరఫున గెలిపించిన ప్రజాప్రతినిధులు మధ్యలోనే మరో పార్టీలో చేరడం భారత రాజకీయాల్లో చాలా కాలంగా జరుగుతున్న పరిణామం. దీనిని అరికట్టేందుకు రాజ్యాంగంలో పదో షెడ్యూల్ ద్వారా వ్యతిరేక ఫిరాయింపు చట్టం తీసుకొచ్చినా, దాని అమలు మాత్రం రాజకీ య పరిస్థితులపై ఆధారపడుతున్నదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా వచ్చిన స్పీకర్ తీర్పు కూడా అదే చర్చను మరోసారి ముందుకు తెచ్చింది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నిర్ణయాలు

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంపై విచారణ ప్రారంభమైంది. పిటిషన్లు దాఖలయ్యాయి, వాదనలు వినిపించాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల నుంచి న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. ఈ ప్రక్రియ నెలల తరబడి సాగింది. విచారణ జరుగుతున్నంతకాలం ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనే కొనసాగుతూ రాజకీయ లాభాలు పొందారని విమర్శలు వినిపిస్తున్నాయి.

చివరకు వచ్చిన తీర్పు కూడా పెద్దగా మార్పు తీసుకురాలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. విచారణ ఎంతకాలం సాగినా చివరకు రాజకీయ సమీకరణాలకే అనుకూలంగా నిర్ణయం వచ్చినట్టయిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఫిరాయింపులను అరికట్టేందుకు దేశంలో వ్యతిరేక ఫిరాయింపు చట్టం అమలులో ఉన్నా అది పూర్తిగా ఫలితాలు ఇవ్వడం లేదనే అభిప్రాయం పెరుగుతున్నది.

ముఖ్యంగా స్పీకర్‌కు ఉన్న అధికారం, నిర్ణయం తీసుకునే సమయానికి ఎలాంటి పరిమితి లేకపోవడం వల్ల చట్టం ఉద్దేశం నెరవేరడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో కొనసాగుతూ పదవులు, రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని చెప్తున్నారు. దీంతో ఫిరాయింపులను అరికట్టాలనే చట్టం లక్ష్యం కొంతవరకు విఫలమవుతున్నదని విమర్శిస్తున్నారు.

ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్నలు

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ప్రజల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజలు ఒక పార్టీ తరఫున గెలిపించిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరడం సరైందా?, ఫిరాయింపు చేసిన వెంటనే సభ్యత్వం రద్దు చేసేలా చట్టం ఎందుకు ఉండదు?, స్పీకర్ నిర్ణయానికి సమయ పరిమితి ఎందుకు ఉండదు?, ప్రజల తీర్పును మార్చే హక్కు ప్రజాప్రతినిధులకు ఎక్కడిది? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేకపోవడం వల్లే ఫిరాయింపుల రాజకీయాలు కొనసాగుతున్నాయని విశ్లేషకులు అంటున్నా రు. ఫిరాయింపులను పూర్తిగా అరికట్టాలంటే చట్టంలో మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫిరాయించిన వెంటనే సభ్యత్వం రద్దు చేసేలా చట్టం తీసుకురావాలని వారు సూచిస్తున్నారు. స్పీకర్ నిర్ణయానికి నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని కూడా అభిప్రాయపడుతున్నారు. కొంతమం ది నిపుణులు అయితే ఈ నిర్ణయాలను స్పీకర్ కాకుండా స్వతంత్ర న్యాయ సంస్థ లేదా ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలని సూచిస్తున్నారు.

అలా చేస్తే రాజకీయ ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టాలంటే ఫిరాయింపులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతను మరిచిపోయే రాజకీయ సంస్కృతి కొనసాగితే ప్రజాస్వామ్య విలువలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వాలు మారినా..

ఫిరాయింపుల రాజకీయాలు కొత్తవి కావు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకున్న ఉదాహరణలు ఉన్నా యి. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ఆ చర్యలను తప్పుబట్టినా, తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు అదే పద్ధతిని అనుసరిం చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఫిరాయింపుల అంశం రాజకీయ నైతికత కంటే అధికార రాజకీయాలకు సంబంధించిన విషయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా రాజకీయ లాభాల కోసం పార్టీలు మారడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అత్యంత ముఖ్యమైనది. ప్రజలు ఒక పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ అభ్యర్థి అదే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలనే భావన ఉంటుంది. అయితే మధ్యలోనే పార్టీ మారడం వల్ల ప్రజల నిర్ణయం అర్థం కోల్పోతుందని నిపుణులు అంటున్నారు. స్పీకర్ పదవి కూడా వివాదాల్లోకి లాగబడుతోందని విమర్శలు ఉన్నాయి. రాజ్యాం గపరంగా స్పీకర్ తటస్థంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, రాజకీయ పరిస్థి తులు ఆ పదవిని కూడా ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.