12 March, 2026 | 7:28 AM

ఎయిరిండియా విమానం పుకెట్‌లో హార్డ్ ల్యాండ్

12-03-2026 01:55 AM

తృటిలో తప్పిన ప్రమాదం

133 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు పయనం

న్యూఢిల్లీ, మార్చి 11: హైదరాబాద్ నుంచి బుధవారం బయల్దేరిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగే సమయంలో రన్‌వేను బలంగా ఢీకొనడంతో ముందుభాగం చక్రం దెబ్బతిన్నది. దీంతో రన్‌వేను మూ సివేస్తూ విమానాశ్రయం అధికారులు నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్) జారీ చేశారు.

బోయింగ్ 737 మ్యాక్స్8 విమానం ఉదయం 133 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ లోని పుకెట్ ఐలాండ్‌కి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.40 గంటలకు విమానం ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలి. అయితే అంతకంటే ముందుగా 11.24 గంటలకు విమానం విమానాశ్రయంలో హార్డ్ ల్యాండ్ అయింది. అయితే, ప్రయాణికులు అంతా క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో విమానం గేర్ భాగం కొద్దిగా దెబ్బతింది. ఫలితంగా విమానం కదలడానికి అవకాశం లేకుండా ఆగిపోయింది. దీంతో అక్కడి నిపుణులు కొద్దిసేపు తనిఖీలు నిర్వహించారు. ఇంకా విమానం భద్రతకు సంబంధించిన తనిఖీలు, మరమ్మతు పనులు వంటివి కొనసాగుతున్నాయి. ఇందుకోసం ఎయిర్‌పోర్ట్ అధికారులు నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్) జారీ చేశారు. రన్‌వేను అధికారులు మూసివేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు రన్‌వేను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొన్ని విమానాల్ని అధికారులు దారి మళ్లించారు.