ఇక ఇండియా జెన్ జీ వంతు
నేపాల్‌లో యువనాయకత్వం హవా!
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం నుంచి దేశ అధికార పగ్గాలు చేబూనేవరకు నేపాల్‌లో ‘జెన్ జీ’ పయనించిం ది. నేపాల్‌లో ఇప్పుడు యువ నాయకత్వ పాలన కొత్త రోల్ మోడల్‌గా నిలిచింది. 35 ఏళ్ల యువ ప్రధాన మం త్రి బాలేంద్ర షా నేతృత్వంలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ప్రభుత్వం అవినీతిపై యుద్ధం ప్రకటించి, పాలనను పారదర్శకత, బాధ్యత, ప్రజాకేంద్రకంగా నడి పిస్తోంది. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం వెలికితీయడం నుంచి మాజీ మంత్రుల అరెస్టుల వరకూ వేగంగా చర్యలు తీసుకుంటూ, ఎన్నాళ్లుగానో నిరాశా నిస్పృహ ల్లో ఉన్న ప్రజల్లో విశ్వాసాన్ని మళ్లీ రగిలిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా ఉన్న భారతదేశంలో మాత్రం ఒక విభిన్న దృశ్యం కని పిస్తోంది. అవినీతి, పాలనా లోపాలు, వ్యవస్థపై అసం తృప్తి గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ.. కోట్లాది జెన్ జీ యువత క్షేత్రస్థాయిలో మిన్నకుండిపోతున్నది. సమస్యలపై స్పందించకుండా డిజిటల్ చర్చలకే పరిమి తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో భారత్ ‘జెన్ జీ’ మేల్కొనేదెప్పుడు?.. దేశంలోని యువత శక్తి తగ్గిందా.. లేక దిశ తప్పిందా? పాలనలోకి నేపాల్ జెన్ జీ విప్ల వం.. నేపాల్ చూపిన దారిలో భారత యువత నడు స్తుందా? భారత జెన్ జీ ముందుకు వచ్చి అవినీతిని ఎదుర్కొనే ఉద్యమాన్ని ప్రారంభించాలి. రాజకీయాలపై ఆసక్తిని పెంపొందించుకోవాలి. రాజకీయాల్లో విలువ లు తీసుకురావాలి. ప్రతి రంగంలో పారదర్శక తను సాధించాల్సిన అవసరం ఉంది.
నేపాల్ చూపిన దారిలో భారత యువత నడుస్తుందా?
పక్క దేశంలో యువ చరిత్ర.. భారత్‌లో ఇంకా ఎదురుచూపులే
- ఉద్యమం నుంచి పాలనలోకి నేపాల్ జెన్ జీ విప్లవం
- నేపాల్ అవినీతిపై ఆర్‌ఎస్‌పీ ప్రభుత్వ యుద్ధం
- యువ నాయకత్వంలో కొత్త మోడల్ పాలన
- భారత్‌లో 37 కోట్ల యువత ఉన్నా క్షేత్రస్థాయి ఉద్యమాల్లేవు
- అవగాహన ఉన్నా ఆన్‌లైన్ చర్చలకే పరిమితం
- ఉద్యోగ భద్రత, ఆర్థిక స్థిరత్వానికే ప్రాధాన్యం
- యువత శక్తి తగ్గిందా? లేక దిశ తప్పిందా?
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : హిమాలయాల నిశ్శబ్దంలో ఒక దేశం తన భవిష్యత్తును తిరగరాస్తుంటే, దాని ప్రభావం ఇప్పుడు దక్షిణాసియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. కేవలం 35 ఏళ్ల యువ ప్రధానమంత్రి బాలేంద్ర షా నేతృత్వంలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్‌ఎస్‌పీ) ప్రభుత్వం అవినీతిపై యుద్ధం ప్రకటించి, పాలనను పారదర్శకత, బాధ్యత, ప్రజాకేంద్రకంగా నడిపిస్తోంది.
స్విస్ బ్యాంకుల్లో నల్లధనం వెలికితీయడం నుంచి మాజీ మంత్రుల అరెస్టుల వరకూ వేగవంతమైన చర్యలు తీసుకుంటూ, ఎన్నాళ్లుగానో నిస్పృహలో ఉన్న ప్రజల్లో విశ్వాసాన్ని మళ్లీ రగిలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా ఉన్న భారతదేశంలో మాత్రం ఒక విభిన్న దృశ్యం కనిపిస్తోంది. అవినీతి, పాలనా లోపాలు, వ్యవస్థపై అసంతృప్తి గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, కోట్లాది జెన్ జీ యువత క్షేత్ర స్థాయిలో స్పందించకుండా డిజిటల్ చర్చలకే పరిమితమవుతోంది.
ఒకవైపు నేపాల్ యువత పాలనను మార్చే శక్తిగా ఎదుగుతుంటే, మరోవైపు భారత యువత వ్యక్తిగత భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, పోటీ ఒత్తిడుల మధ్య స్థిరత్వాన్ని ఎంచుకుంటోంది. ప్రస్తుత పరిణామాలు నడుమ మార్పు కోసం ఎదురు చూడటంతోనే సరిపెట్టుకుందామా?, లేక మార్పును సృష్టించే బాధ్యత యువతదేనా? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. యువత ముందుకు వస్తే పాలన మారుతుందని నేపాల్ చూపుతున్న మార్గం ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి భారతదేశ జెన్ జీ పైనే ఉంది.
యువ పాలనపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం
ప్రస్తుతం నేపాల్‌లో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. కేవలం 35 ఏళ్ల యువ ప్రధానమంత్రి బాలేంద్ర షా (బాలెన్) మార్చి 27న పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది వారాల్లోనే, ఆయన నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పీ ప్రభుత్వం అవినీతిపై యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ చర్యలు ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని, దేశ ఆర్థిక భవిష్యత్తును కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. గత ఏడాది యువత నేతృత్వంలో జరిగిన నిరసనల నుంచి ఎదిగిన విద్యావంతులైన యువ నాయకులతో కూడిన ఈ ప్రభుత్వం కేవలం అధికారాన్ని చేపట్టడం మాత్రమే కాదు, నేపాల్ పాలనా విధానాలను పూర్తిగా తిరగరాస్తోంది.
పారదర్శకత, అంతర్జాతీయ సహకారం, ప్రజలకు నేరుగా లాభాలు అనే మూడు కీలక లక్ష్యాలతో ముందుకు సాగుతూ, ఎన్నాళ్లుగానో అవినీతి, అస్థిరతతో అలసిపోయిన ప్రజలకు స్పష్టమైన ఆశను అందిస్తోంది. మార్చి 5న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీ దాదాపు 50 శాతం ఓట్లు సాధించి, 165 స్థానాల్లో 125 సీట్లు గెలుచుకుని 1999 తర్వాత మొదటిసారి ఒకే పార్టీ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
నిర్మాణ ఇంజనీర్‌గా, కాఠ్మాండు మేయర్‌గా పనిచేసిన బాలెన్, అలాగే రాజకీయ అనుభవం లేని, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న హోం మంత్రి సూడాన్ గురుంగ్ కలిసి కొత్త తరహా నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. పదవిలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 100 పాయింట్ల పాలనా సంస్కరణల ప్రణాళికను అమలు చేస్తూ, 1991 నుంచి ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల ఆస్తులపై విచారణలు ప్రారంభించారు.
మార్చి 29న మాజీ ఎనర్జీ మంత్రి దీపక్ ఖడ్కాను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయడం, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన కుటుంబంపై విచారణలు ప్రారంభించడం వంటివి దశాబ్దాలుగా కొనసాగిన ఎలైట్ ఇమ్యూనిటీకి ముగింపు పలికే చర్యలుగా నిలిచాయి. ఇక అంతర్జాతీయంగా కూడా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని తిరిగి తెప్పించేందుకు హోం మంత్రి గురుంగ్, స్విస్ అంబాసడర్ డేనియల్ మ్యూలీతో సమావేశమై సంయుక్త విచారణలు, డబ్బు తిరిగి పొందే విధానాలపై చర్చించారు.
తిరిగి వచ్చే నిధులను దేశ అభివృద్ధి కోసం, మౌలిక వసతులు, ఉద్యోగాల సృష్టి, భూకంప హెచ్చరిక వ్యవస్థల బలోపేతం వంటి కీలక రంగాలకు వినియోగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్విస్ అధికారులు సహకారం చూపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపాల్‌కు ఇది ఒక పెద్ద దౌత్య విజయంగా భావిస్తున్నారు. ఈ చర్యలు విజయవంతమైతే, దేశానికి గణనీయమైన వనరులు అందే అవకాశముంది.
రూపుదిద్దుకుంటున్న కొత్త నేపాల్
నేపాల్‌కు ఇలాంటి ఆర్థిక పరిణామాలు అత్యంత అవసరం. 2024లో 20.82 శాతంగా ఉన్న యువ నిరుద్యోగం ప్రస్తుతం 21 శాతంగా నమోదైంది. దీనివల్ల ప్రతిరోజూ 2,300 మందికి పైగా గల్ఫ్ దేశాలు, భారత్, మలేషియా వంటి దేశాలకు ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా రిమిటెన్సులపైనే ఆధారపడుతోంది. ఇదే సమయంలో, పాలనలో వైఫల్యాల కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 2018- 149.83 మిలియన్ల నుంచి 2024- కేవలం 86 మిలియన్లకు పడిపోయాయి. ఎఫ్‌డీఐలో 42.5 శాతం పతనాన్ని చవి చూసింది.
ట్రాన్స్‌పరెన్సీఇంటర్నేషనల్ విడుదల చేసిన 2025 అవినీతి గ్రహణ సూచికలో నేపాల్‌కు 100లో 34 స్కోరు మాత్రమే లభించి, 182 దేశాల్లో 109వ స్థానంలో నిలిచింది. ఇది ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని ప్రతిబింబించింది. అదే 2025లో జరిగిన ప్రజా ఉద్యమానికి దారితీసింది. ఆ ఆందోళనలు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపాయి. సుమారు 1.3 శాతం జీడీపీ (దాదాపు 586 మిలియన్) నష్టం జరిగింది. మరోవైపు, రాజకీయ అస్థిరత తీవ్రంగా ఉంది. 2012 నుంచి ఇప్పటివరకు 15 మంది ప్రధాన మంత్రులు మారడం దీనికి ఉదాహరణ.
ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇప్పటికే సానుకూల ఫలితాలు చూపిస్తున్నాయి.ఆర్‌ఎస్‌పీ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించడంతో పెట్టుబడిదారుల విశ్వాసం మళ్లీ పెరుగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల్లోనే ఎఫ్‌డీఐ కట్టుబాట్లు ఏడాది వారీగా 50 శాతం పెరగడం ఈ మార్పుకు సంకేతం. ప్రత్యేకంగా యువతకు ఈ పరిణామం కొత్త ఆశను రేకిస్తోంది.
నిరసనలకు నడుం బిగించిన యువత ఇప్పుడు పాలనలో మార్పును ప్రత్యక్షంగా చూస్తోంది. స్విస్ బ్యాంకుల నుంచి తిరిగి వచ్చే నల్లధనం వృత్తి శిక్షణ, స్థానిక పరిశ్రమలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది కుటుంబాలను విడదీస్తున్న వలస సమస్యను కూడా తగ్గించగలదు. యువ నాయకులు బాలేంద్ర షా, సూడాన్ గురుంగ్ తమ ముప్పుల్లోనే రాజకీయ వారసత్వం కాకుండా ప్రొఫెషనల్ నేపథ్యంతో ఎదిగారు.
వీరి పాలన ప్రజలకు చేరువగా, స్పందనాత్మకంగా మారుతోంది. ఇది ఒక కొత్త తరహా పాలన. దీంతో పారదర్శకత పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, నిరాశ తగ్గుతుంది. యువతపై దృష్టి పెట్టిన సంస్కరణలు 20 శాతానికి పైగా ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పిందే చేస్తుందనే భావక ప్రజల్లో పెరుగుతోంది. అక్కడి ప్రజల్లో ఉన్న నిస్సహయతను తగ్గించి కొత్త నేపాల్ రూపుదిద్దుకుంటోంది.
నేపాల్‌పై జెన్ జీ పాలన ముద్ర
అవినీతి విచారణలను ప్రతిఘటనలు లేకుండా అమలు చేయడం, విదేశీ ఒప్పందాలను నిజమైన నిధుల రాబడిగా మార్చడం, 2025 కల్లోలాల తర్వాత కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం వంటివి సవాళ్లుగా ఉన్నాయి. ఇవి యువ నాయకత్వానికి పెద్ద పరీక్షగా పరిణమించొచ్చు. అయినప్పటికీ బాధ్యతాయుత పాలన కావాలనే ఆశతో స్పష్టమైన తీర్పు ఇస్తూ ఓటు వేసిన ప్రజలకు ఆర్‌ఎస్‌పీ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెడుతోంది.
వేగవంతమైన అరెస్టులు, చురుకైన దౌత్య చర్యలు ప్రభుత్వానికి ఉన్న దృఢ సంకల్పాన్ని చూపిస్తూ, సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని మళ్లీ నిర్మిస్తున్నాయి. సుమారు 3 కోట్ల జనాభా ఉన్న నేపాల్‌కు ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ఇది ఒక తరం మార్పు. ఎన్నాళ్లుగానో రాజకీయ అస్థిరత, వలసలతో గుర్తింపు పొందిన దేశం, ఇప్పుడు యువత ఆశయాలను అర్థం చేసుకున్న నాయకత్వాన్ని పొందింది.
బాలేంద్ర షా, సూడాన్ గురుంగ్ వంటి నాయకులు అవినీతిని మూలాలతోనే ఎదుర్కొంటూ, అంతర్జాతీయ భాగస్వామ్యాలను దేశ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. దీంతో కోల్పోయిన సంపదను తిరిగి తెచ్చుకోవడమే కాకుండా, ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని కూడా పునరుద్ధరిస్తున్నారు. రాబోయే నెలల్లో ఎంత మేరకు నిధులు తిరిగి వస్తాయో చూడాల్సి ఉన్నా, ఒక విషయం మాత్రం స్పష్టమవుతున్నది. పారదర్శకత, సమర్థత, ప్రజాకేంద్రిత పాలనతో కొత్త నేపాల్ రూపుదిద్దుకుంటోంది. హిమాలయాల చరిత్రలో ఈ యువ నాయకత్వం ఇప్పటికే తన ముద్ర వేసింది.
నేపాల్లో జరుగుతున్న ఈ మార్పు మన దేశ యువతకు స్పష్టమైన సందేశం. మన దేశంలో రాజకీయ పార్టీలు తమ బాధ్యతల్లో విఫలం అవుతున్నాయా?, అవినీతి, అధికార దుర్వినియోగం పెరుగుతున్నాయా?, రాజకీయ నెక్సస్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇది ఒక హెచ్చరికగా భావించాలి. భారత జెన్ జీ ముందుకు రావాలి. అవినీతిని ఎదుర్కొనే ఉద్యమాన్ని ప్రారంభించాలి. రాజకీయాల్లో విలువలు తీసుకురావాలి. ప్రతి రంగంలో పారదర్శకతను సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది.
భారత్‌లో కనిపించని జెన్ జీ
భారతదేశంలో సుమారు 37.7 కోట్ల మంది ఉన్న జెన్ జీ దేశ జనాభాలో దాదాపు 27 శాతంగా ఉంది. డిజిటల్ యుగంలో పెరిగిన ఈతరానికి పాలనలో లోపాలు, అవినీతి, వ్యవస్థలోని లోపాలపై సమాచారం వీరికి ఎప్పుడూ అందుబాటులో ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు, భూమి- వ్యవహారాలు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, మీడియా వంటి రంగాల్లో అవినీతి ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నా, వీరి నుంచి పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయి స్పందన కనిపించడం లేదు. ఒకప్పుడు విద్యార్థి, యువజన ఉద్యమాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి.
స్వాతంత్య్ర పోరాట కాలంలో యువత బహిష్కరణలు, నిరసనల ద్వారా బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరింది. 1974లో నవనిర్మాణ్ ఆందోళన్ గుజరాత్‌లో విద్యార్థుల నిరసనగా ప్రారంభమై, అవినీతి ఆరోపణల మధ్య ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ రాజీనామాకు దారితీసింది. ఇది మధ్యతరగతి కోపాన్ని ప్రతిబింబిస్తూ, యువత ఒత్తిడి ప్రభుత్వాలను కూల్చగలదని చూపించింది.
అలాగే 1990లో మండల్ కమిషన్ ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా భారీ విద్యార్థి నిరసనలకు దారితీసి, రిజర్వేషన్ విధానాలు, రాజకీయ చర్చలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసింది. వామపక్ష ఉద్యమాలు కూడా భూసంస్కరణలు, ఆర్థిక అసమానతల వంటి అంశాలపై యువత శక్తిని వినియోగించాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 అవినీతి సూచికలో భారత్‌కు 100లో 38 స్కోరు, 180 దేశాల్లో 96వ స్థానం ఇచ్చింది.
ప్రజా వ్యవస్థలో ఇంకా సమస్యలు ఉన్నాయని ఇది సూచిస్తోంది. రాజకీయ నాయకులు, ల్యాండ్ మాఫియా, ఆర్థిక మోసాలు, న్యాయ వ్యవస్థ ఆలస్యం, బ్యూరోక్రటిక్ రెడ్‌టేప్, మీడియా పక్షపాతం వంటి అంశాలు తరచూ చర్చలోకి వస్తున్నాయి. అయినా, పొరుగు దేశాలతో పోలిస్తే భారత జెన్ జీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకోవడం లేదు. 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్, 2025లో నేపాల్.. ఈ దేశాల్లో యువత ప్రభుత్వ భవనాలను ముట్టడించి, పాలన మార్పులకు దారితీసింది. కానీ భారతదేశంలో ఇలాంటి దేశవ్యాప్త ఉద్యమం ఇప్పటివరకు కనిపించలేదు.
నిరసనలకు దూరంగా భారత యువత
తాజా గణాంకాలు ఒక స్పష్టమైన మార్పును చూపిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో యువత ఓటింగ్ శాతం సుమారు 65 శాతానికి తగ్గింది. ముఖ్యంగా 18 ఏళ్ల యువతలో కేవలం 38 శాతం మాత్రమే ఓటరు నమోదు చేసుకున్నారు. లోక్‌నీతి సీఎస్‌డీఎస్ నిర్వహించిన 2024 యువ సర్వేలో (18 ఏళ్లలో 1,200 మందిపై) 92 శాతం మంది దేశ విషయాలను యువత అనుసరించాలని అంగీకరించగా, దాదాపు 79 శాతం రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పారు.
కుటుంబం, స్నేహితులతో రాజకీయాలపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ, నమోదు శాతం మాత్రం 45 శాతానికి పరిమితమైంది. సమయం లేకపోవడం, అవసరమైన డాక్యుమెంట్లు లేకపోవడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితులు యువత ప్రాధాన్యతలను మార్చుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 2025లో 15 ఏళ్ల మధ్య యువ నిరుద్యోగం 9.9 శాతం ఉన్నప్పటికీ, గ్రాడ్యుయేట్లలో ఇది మరింత ఎక్కువగా ఉంది.
కొన్ని అంచనాల్లో 15 ఏళ్ల వయస్సు గలవారిలో 40 శాతానికి చేరుకుంటోంది. 15 ఏళ్లలో 36.7 కోట్ల మంది ఉండటంతో ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అందువల్ల చాలా మంది యువత దీర్ఘకాలిక ఉద్యమాల కంటే ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు, స్కిల్స్ అభివృద్ధి, లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలపై దృష్టి పెడుతున్నారు. సోషియాలజిస్ట్ దీపాంకర్ గుప్తా అభిప్రాయం ప్రకారం, ప్రతి తరం తనకంటూ ప్రత్యేక లక్ష్యాలను ఏర్పరుచుకుంటుంది. ప్రస్తుతం యువతకు గత తరాల ఉద్యమాల వారసత్వం కంటే తక్షణ ఆర్థిక భద్రత ముఖ్యంగా మారింది.
ఇక జెన్ జీలో 98 శాతం మంది రోజూ స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వాడుతున్నారు. వారిని అవినీతి, అసమానతల గురించి అప్రమత్తం చేస్తున్నాయి. కానీ అదే సమయంలో చిన్న చిన్న ట్రెండ్స్, సెలబ్రిటీ కల్చర్, రాజకీయ ప్రచారం కూడా ఎక్కువగా దృష్టి మరల్చుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్లు, ఎగ్జామ్ అవకతవకలు, స్థానిక సమస్యలపై వేగంగా వ్యాప్తి చెందుతున్నా, అవి ఎక్కువగా ఆన్‌లైన్‌కే పరిమితమైపోతున్నాయి. మరోవైపు, యువతలో స్వీయ నియంత్రణ పెరుగుతోంది.
అంటీ-నేషనల్ అనే ముద్ర పడుతుందేమో అనే భయం, డాక్సింగ్, సర్వైలెన్స్ భయాలు, సోషల్ మీడియా దాడులు వంటివి వారిని నిరసనల నుంచి దూరంగా ఉంచుతున్నాయి. అదనంగా, కులం, ప్రాంతం, భాష, మత విభజనలు యువతలో ఐక్యతను బలహీనపరుస్తున్నాయి. ఒకప్పుడు నిరసనలకు కేంద్రాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు పరిమితులు, రాజకీయ ధ్రువీకరణ వల్ల తమ శక్తిని కోల్పోతున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
నేపాల్‌లో సంచలన పరిపాలనా సంస్కరణలు
ప్రధానమంత్రి లేదా ఇతర రాజకీయ నాయకుల ఫోటోలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రదర్శించడంపై నిషేధం విధించారు. అవసరమైన ప్రదేశాల్లో మాత్రమే అనుమతి, వ్యక్తి పూజకు చెక్ పెట్టారు. అనవసర ఖర్చులకు తగ్గించారు.
వీఐపీ కల్చర్ పూర్తిగా రద్దు చేశారు. రాజకీయ నేతల కాన్వాయ్ల కోసం ట్రాఫిక్ ఆపివేతలు నిలిపివేశారు. ప్రజా రహదారులపై ప్రత్యేక హక్కులు లేవు. ఎవరైనా మంత్రుల వాహనాలను ఆపి చెక్ చేయవచ్చు.
నిజమైన ముప్పు ఉన్నవారికే భద్రత కల్పిస్తున్నారు. స్టేటస్ సింబట్‌గా సెక్యూరిటీకి చెక్, పోలీసు వనరులు ప్రజలకు మళ్లించారు.
రాజకీయ నాయకులు, అధికారులు దశాబ్దాలుగా కూడబెట్టిన అక్రమ ఆస్తులపై విచారణలు ప్రారంభం.
స్విస్ బ్యాంకుల్లో ఉన్న అక్రమ నిధులపై దర్యాప్తు, రికవరీకి చర్యలు.
మంత్రులు, అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి అనే నిబంధన.
విద్యలో రాజకీయాలకు చెక్ పెడుతూ పార్టీలకు అనుబంధ స్టూడెంట్ యూనియన్ల నిషేధం.
100 పాయింట్ల సంస్కరణల ప్రణాళికలో భాగంగా పదవిలోకి వచ్చిన వెంటనే టైమ్ బౌండ్ గవర్నెన్స్ అజెండా అమలు.
రియల్ టైమ్ పారదర్శక డ్యాష్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతి, ఖర్చులు, బాధ్యుల వివరాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
స్మార్ట్ టోల్ స్థానిక పాలనలో భాగంగా కాలనీ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సేవల నిర్వహణ.
కేరీర్‌కే అత్యంత ప్రాధాన్యం
దీనికి సంస్థాగత స్థిరత్వం కూడా మరో కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొరుగు దేశాల్లో ప్రభుత్వాల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు నిరసనలు పెరిగి మార్పులకు దారితీస్తే, భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోపాలు ఉన్నప్పటికీ నియమిత ఎన్నికల ద్వారా మార్పుకు అవకాశాలను ఇస్తోంది. ఇటీవలి పోస్ట్-పోల్ సర్వేల ప్రకారం బీజేపీకి యువతలో సుమారు 40 శాతం మద్దతు కొనసాగుతున్నట్టు స్పష్టమైంది.
చాలా మంది యువత, ప్రభుత్వ పథకాలు లేదా ప్రైవేట్ రంగ అభివృద్ధి ద్వారా క్రమంగా మార్పులు సాధ్యమని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని జెన్ జీ వర్గాలను ఒకే అంశంపై ఏకం చేసే శక్తి ప్రస్తుతం కనిపించడం లేదని బీహార్‌కు చెందిన ఒక యువ కార్యకర్త చెబుతున్నారు. విమర్శకులు మాత్రం ఈ ధోరణిని అసక్తిగా కాకుండా, ప్రాగ్మాటిక్ అడాప్టేషన్‌గా చూస్తున్నారు. తీవ్రమైన పోటీ ఉన్న పరిస్థితుల్లో, కెరీర్‌పై దృష్టి పెట్టడం యువతకు అవసరంగా మారింది.
జెన్ జీ లో చాలా మంది తమ భవిష్యత్తుపై ఉన్న ఆందోళనల మధ్య ముందుగా మనం స్థిరపడాలి అనే దృక్పథాన్ని అవలంభిస్తున్నారు. వ్యవస్థను పూర్తిగా మార్చడం అనేది అసాధ్యంగా అనిపిస్తోంది. అందుకే మన అభివృద్ధిపై దృష్టి పెట్టడం తప్ప మార్గం కనిపించడం లేదని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఒక యువకుడు అభిప్రాయపడ్డారు.
సమాచారం అధికంగా ఉండి, అవకాశాలు పరిమితంగా ఉన్న దశలో జెన్ జీ ఒక సమతుల్యత కోసం ప్రయత్నిస్తోంది. వీధి నిరసనల కంటే స్థిరమైన జీవితం, ఉద్యోగ భద్రత, వ్యక్తిగత అభివృద్ధిఇవి ప్రాధాన్యంగా మారాయి. గతంలో యువ ఉద్యమాలు దేశ దిశను మార్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. సామూహిక ఉద్యమాల కంటే వ్యక్తిగత లక్ష్యాలు, భౌతిక నిరసనల కంటే డిజిటల్ చర్చలు, సంఘర్షణ కంటే స్థిరత్వానికే ప్రాధాన్య పెరింది.
భారతదేశం తన డెమోగ్రాఫిక్ డివిడెండ్ దశలో ఉన్నప్పుడు, యువత నుంచి వస్తున్న ఈ నిశ్శబ్దం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇది శాశ్వత మార్పా?, లేక ఆర్థిక ఒత్తిడుల కారణంగా వచ్చిన తాత్కాలిక దశా? అనే చర్చ సోషియాలజిస్టులు, రాజకీయ విశ్లేషకుల మధ్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత జెన్ జీ ఆచరణాత్మక దృక్పథం వైపు వెళ్తుందా లేక ఒక రోజు మళ్లీ ఉద్యమాల దిశగా మలుపు తిరుగుతుందా? వేచి చూడాలి.





