13 April, 2026 | 3:47 AM

ఆశా భోస్లే ఇకలేరు

13-04-2026 02:07 AM
  1. అభీ నా జావో చోడ్ కర్..

    బాలీవుడ్ స్వర జలపాతం ఆగింది..

    భారతీయ సినీ సంగీతం మూగబోయింది. ఎనిమిది దశాబ్దాలుగా అందరినీ మంత్ర ముగ్ధులను చేసిన ఆ స్వరం ఆగిపోయింది. ఆశా భోస్లే కన్నుమూశారు. ౯౨ ఏండ్ల వయస్సులో.. ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని డాక్టర్లు చెప్పినట్టుగా ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తెలిపారు. అస్వస్థతతో ఆమె శనివారం ఆసుపత్రిలో చేరారు. ౧౯౩౩లో సాంగ్లీలో పుట్టిన ఆశా భోస్లే తన ౧౨వ ఏట నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. ౨౦కి పైగా భాషల్లో.. ౧౨ వేల పాటల్లో ఆమె గొంతు వినిపించింది. ఆశా భోస్లే మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

గగన సీమలకు ఆశల గాన లాహిరి!

భారతీయ సంగీత వినీలాకాశంలో ఏడు దశాబ్దాల పాటు ధ్రువతారలా వెలిగిన గాన కోకిల ఆశా భోస్లే నిష్ర్కమణతో ఒక అధ్యాయం ముగిసినట్లయింది. ఆమె గొంతు ఒక జలపాతంలా ఉరకలెత్తింది. ఆమె గాత్రం మల్లెపువ్వులా మెత్తగా ఉంటూనే మెరుపుతీగలా మెరిసింది. శృంగార గీతాల్లోని చిలిపితనం నుంచి విరహ గీతాల్లోని ఆర్ద్రత వరకు ప్రతి భావాన్ని ఆమె తన గొంతులో పలికించారు.

శాస్త్రీయ సంగీతంలో ఎంత ఒద్దికగా పాడగలరో, పాశ్చాత్య బాణీలను కూడా అంతే అలవోకగా పాడటం ఆమె ప్రత్యేకత. ఆమె ఏ వయస్సులో పాట పడుతున్నా పడుచు పిల్ల గొంతుతో పాడటం ఆమెకే సాధ్యమైంది. అందుకే ఆమె ఒక్క శాస్త్రీయ సంగీతానికే కాకుండా గజల్స్, పాప్, జానపదం ఇలా ప్రతి ప్రక్రియలోనూ ఆమె తనదైన ముద్ర వేశారు. ఆమె మన మధ్య భౌతికంగా లేనప్పటికీ, ఆ అపురూప స్వరరాగం మన జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది.

  1. సంగీత ప్రపంచాన్ని వీడి దివికేగిన గాయని ఆశాజీ
  2. ఒకటి కాదు.. వందలు కాదు.. ఏకంగా 12 వేల పాటలు
  3. ఆమె సేవలకు వరించిన పద్మవిభూషణ్  పురస్కారం
  4. గిన్నీస్ రికార్డుల్లో చోటు.. ఇంకా మరెన్నో రికార్డులు సొంతం
  5. ఆమె నిష్క్రమణ.. సంగీత ప్రియులకు తీరని లోటు
  6. నేడు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు 
  7. అధికారిక లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంతిమ వీడ్కోలు
  8. భారీగా తరలిరానున్న అభిమానులు

ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఒక సంగీత కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. ఆయన నాటక రంగంలో కూడా ప్రసిద్ధుడు. తల్లి శేవంతి సాధారణ గృహిణి. ఆశకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. అక్కలు లతా మంగేష్కర్, మీనా ఖాడీకర్, ఉషా మంగేష్కర్ మంచి గాయనీమణులు. సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కూడా మంచి సంగీతకారుడు.

దీంతో ఇంట్లో ప్రతిరోజూ కుటుంబ సభ్యులంతా సంగీత సాధన చేసేవారు. ఈ ప్రభావం ఆశపై పడింది. బాల్యమంతా సంగీత సాధనతోనే గడిచింది. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో కుటుంబంపై ఆర్థిక భారం పడింది. కుటుంబ పోషణ కోసం ఆశ కేవలం ౧౨ వయస్సులోనే తన గాన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1943లో ‘మాఝా బాల్’ అనే మరాఠీ సినిమా ద్వారా ఆమె గాయనిగా సినీ రంగంలోకి ప్రవేశించారు. 1948లో విడుదలైన ‘చునారియా’ అనే హిందీ చిత్రంలో పాడి పాటల ద్వారా ఆమె గుర్తింపు పొందారు. ఆ సమయంలో లతా మంగేష్కర్, గీతా దత్ వంటి గాయనీమణులు అగ్రస్థానంలో ఉండేవారు. వారిద్దరూ వదులుకున్న క్లిష్టమైన పాటలను ఆశ పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. 

సంగీత దర్శకుల ప్రోత్సాహం

ఆశా భోస్లే ఎదుగుతున్న క్రమంలో నాటి దిగ్గజ సంగీత దర్శకులు ఓపీ నయ్యర్, ఎస్డీ బర్మన్, ఆర్డీ బర్మన్ ఆమె ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాలకు పైగా ఆమె తన గాత్రంతో పది వేలకు పైగా పాటలను ఆలపించారు. తద్వారా ఆమె గిన్నిస్ రికార్డు సాధించారు. ఆశా భోస్లేకు తన సోదరి లతా మంగేష్కర్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. ఒకే వృత్తిలో ఉన్న ఇద్దరు సోదరీమణుల మధ్య కొన్ని దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది.

వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని అప్పట్లో అనేక వార్తలు వచ్చేవి. వృత్తిపరమైన విభేదాల వల్ల కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకోలేదనే ప్రచారం కూడా జరిగింది. అయితే, వ్యక్తిగతంగా వారిద్దరూ ఒకరినొకరు అమితంగా ప్రేమించుకునేవారు. లత మరణించినప్పుడు ఆశ ఎంతో కుంగిపోయారు. ఆ అనుబంధం రక్తసంబంధం నుంచి పుట్టిన గొప్ప గౌరవంగా నిలిచిపోయింది. ఒకరికొకరు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచారు.

వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు

ఆశా భోస్లే వ్యక్తిగత జీవితం అనేక మలుపులతో నిండి ఉంది. ఆమె కేవలం 16 ఏళ్ల వయస్సులోనే గణపత్‌రావు భోస్లే అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లి వల్ల ఆమె కొంతకాలం పుట్టింటికి దూరమయ్యారు. ఆ బంధం ద్వారా ఆమెకు ముగ్గురు సంతానం కలిగారు.

అయితే భర్త నుంచి శారీరక, మానసిక వేధింపులు పెరగడంతో ఆమె విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పసిపిల్లలతో బయటకు వచ్చి కష్టపడి తన కెరీర్ ను తిరిగి నిర్మించుకున్నారు. తిరిగి 1980లో ఆమె సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి జోడి సినీ సంగీత చరిత్రలో అద్భుతమైన గీతాలను అందించింది. 1994లో బర్మన్ మరణించే వరకు వారిద్దరూ అన్యోన్యమైన జీవితం గడిపారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచారు.

మరుపురాని మధుర గీతాలు

ఆశా భోస్లే హిందీ సినీ సంగీత ప్రపంచంలో వేల సంఖ్యలో అద్భుతమైన పాటలు పాడారు. ఆమె పాడిన ‘చురా లియా హై తుమ్నే జో దిల్ కో’ పాట నేటికీ యువతను అలరిస్తూనే ఉంది. ‘పియా తూ అబ్ తో ఆజా’ వంటి క్యాబరే గీతాలతో ఆమె తన గొంతులోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. ‘ధమ్ మారో ధమ్’ పాట ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ‘యే మేరా దిల్ యార్ కా దివానా’ అనే పాటలో ఆమె పలికించిన గమకాలు అద్భుతం.

‘ఆవో హుజూర్ తుమ్కో’ వంటి గజల్ తరహా పాటల్లో ఆమె క్లాసికల్ టచ్ కనిపిస్తుంది. ‘కజ్రా మొహబ్బత్ వాలా’ పాటలో ఆమె గొంతులోని చిలిపితనం ఉట్టిపడుతుంది. ‘మెహబూబా మెహబూబా’ అంటూ ఆమె చేసిన ప్రయోగం సంచలనం సష్టించింది. ‘దిల్ చీజ్ క్యా హై’ వంటి పాటలతో ఆమె శాస్త్రీయ సంగీతంలో తన పట్టును నిరూపించుకున్నారు. ‘ఓ మేరే సోనా రే’ వంటి మెలోడీలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి. 

తెలుగులోనూ పాటలు

ఆశా భోస్లే తెలుగు చిత్రాల్లోని పాటలకూ గాత్రం అందించారు. శీతాకాలం ప్రేమకు (అశ్వమేథం), ఓ ప్రేమ (అశ్వ మేథం), జీవితం సప్త సాగర (చిన్ని కృష్ణుడు), ఇది మౌనగీతం (పాలు నీళ్లు), ఝల్లుమంది మది (ప్రేమకు ప్రేమంటే తెలుసా), నాలో ఊహలకు (చందమామ) వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.

లెక్కలేనన్ని పురస్కారాలు

ఆశా భోస్లే సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’తో గౌరవించింది. అంతకుముందే ఆమె ‘పద్మ విభూషణ్’ అవార్డును కూడా స్వీకరించారు. భారత సినీ రంగంలోనే మేటి పురస్కారమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ ఆమె కీర్తి కిరీటంలో మకుటంగా నిలిచింది. ఉత్తమ నేపథ్య గాయనిగా రెండు సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకున్నారు.

ఫిలింఫేర్ నుంచి ఏడు సార్లు ఉత్తమ గాయనిగా ఎంపికయ్యారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తర్వాత ఆమె, స్వయంగా ఫిలింఫేర్ అవార్డుల పోటీ నుంచి తప్పుకొన్నారు. ఫిలింఫేర్ ఈ క్రమంలో ఆమెకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘లతా మంగేష్కర్’ అవార్డును ఆమె అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తన అత్యున్నత పురస్కారమైన ‘మహారాష్ట్ర భూషణ్’ ఆమె అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను గుర్తించింది. ఆమె సంగీతానికి చేసిన సేవలకు గాను బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆమె పాడిన ప్రతి పాట ఒక అద్భుతమైతే ఆమె అందుకున్న ప్రతి అవార్డు ఆమెకు దక్కిన గౌరవం.

ఆశా భోస్లే కన్నుమూత 

ముంబై, ఏప్రిల్ 12: దిగ్గజ గాయని ఆశా భోస్లే (92) తీవ్ర అనారోగ్యం పాలై ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు.

ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుండగా ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న యావత్ దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురైంది. సుమారు ఏడు దశాబ్దాల నుంచి వేలాది పాటలతో అలరించిన ఆ స్వరం మూగబోవడంతో సంగీత అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ‘ప్రభు కుంజ్’ నివాసంలో ఉంచారు. ఆశా చివరి రోజుల్లో ఆమె బాగోగులను కుమారుడు ఆనంద్ భోస్లే కుటుంబం చూసుకుంది.

ముంబైలోని ఆమె నివాసంలోనే ప్రత్యేక వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసి నిరంతరం నిపుణులైన వైద్యులతో ఆరోగ్య పరీక్షలు చేయించింది. ఆ కుటుంబం ముంబై దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో సోమవారం ఆశా భోస్లే అంత్యక్రియలు నిర్వహించనున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమసంస్కాలు పూర్తి చేయనున్నది. భారతీయ సంగీత జగత్తుకు ఆమె అందించిన అసమానమైన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. 

అరుదైన గాయని అస్తమయం

భారతీయ సంగీత ప్రపంచంలో ఆశా భోస్లే ఒక అపురూప మైన శిఖరం. అరుదైన గాయని. ఆమె మరణం దేశానికి తీరని లోటు. ఆమె గొంతులోని వైవిధ్యం కోట్ల మందిని అలరించింది. సంగీత రంగంలో ఆమె సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

మరణం కలచివేసింది..

ఆశా భోస్లే మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె ఒక సంగీత విదూషీమణి మాత్రమే కాదు. భారతీయ సంస్కతికి గొప్ప ప్రతినిధి. ఆమె పాడిన వేలాది పాటలు తరతరాల పాటు వినిపిస్తూనే ఉంటాయి. సంగీత ప్రపంచంలో ఆమె సష్టించిన శూన్యం ఎప్పటికీ పూడ్చలేనిది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె స్వరం నిరంతరం మనల్ని పలకరిస్తూనే ఉంటుంది.

మోదీ, ప్రధాని

ఆత్మకు సద్గతులు కలగాలి

దిగ్గజ గాయని ఆశా భోస్లే గారి మరణం విచారకరం. ఆమె తన గానంతో దశాబ్దాల పాటు భారతీయ సినీ రంగాన్ని శాసించారు. శాస్త్రీయ సంగీతం నుంచి ఆధునిక పాటల వరకు ఆమె చేసిన ప్రయోగాలు అద్భుతం. ఆమె అద్భుతమైన ప్రతిభకు పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అవార్డులు దక్కడం గర్వకారణం. ఆమె చిరస్మరణీయమైన పాటల ద్వారా మన మధ్యే జీవిస్తారు. ఆమె ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను.

అమిత్ షా కేంద్ర, హోం మంత్రి 

పాటలు చిరస్థాయిగా నిలుస్తాయి

భారతీయ సినీ సంగీత సామ్రాజ్ఞి ఆశా భోస్లే మరణం తీరని లోటు. ఆమె ఏడు దశాబ్దాల పాటు తన మధుర గాత్రంతో కోట్లాది మందిని అలరించారు. తెలుగు సినిమాల్లో ఆమె పాడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి పెద్ద దెబ్బ. ఆశా భోస్లే గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

గానకోకిల శాశ్వతంగా మూగబోయింది

ఆశా భోస్లే ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె ఒక గాన కోకిల. సంగీత ప్రపంచంలో ఆమె ఒక గొప్ప శకాన్ని సృష్టించారు. తెలుగులో కూడా ఆమె అనేక అద్భుతమైన గీతాలను ఆలపించారు. ఆమెతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆమె కుటుంబానికి నా సానుభూతిని ప్రకటిస్తున్నాను.

చిరంజీవి, నటుడు