21 August, 2026 | 10:23 PM

గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ

21-08-2026 09:20 PM

బోధన్,(విజయక్రాంతి): గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్‌లోని గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. గత వారం వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులు పలు సమస్యలను వివరించారు. వసతి గృహంలో మెనూ ప్రకారం భోజనం అందకపోవడం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం, దోమతెరలు, లైట్లు, ఫ్యాన్ల కొరతతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన నోట్‌బుక్‌లు, మ్యాట్లు, ఇతర సామాగ్రి అందకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సంఘం నాయకులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జాదవ్ ప్రవీణ్ నాయక్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్, కమిటీ సభ్యులు విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు. అనంతరం వసతి గృహ వార్డెన్, సిబ్బందితో మాట్లాడి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, మరుగుదొడ్లను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందాల్సిన నోటుబుక్కులు, దోమతెరలు, మ్యాట్లు, ఇతర సామాగ్రిని సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న నిరుపేద గిరిజన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర బంతిలాల్ నాయక్, ఉపాధ్యక్షుడు బర్మావత్ నరేష్ నాయక్, బంజారా యువ నాయకుడు మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.