31 August, 2026 | 3:56 PM

ప్రాణాలు కాపాడాల్సిన

31-08-2026 02:47 PM

జిల్లాలో ప్రైవేటు అంబులెన్స్‌ల పేరుతో డ్రైవర్ల ఇష్టారాజ్యం...?

ఆర్టీవో నిబంధనలు గాలికి...అధికారుల తనిఖీల జాడ ఎక్కడ...?

ఫిట్‌నెస్.. ఇన్సూరెన్స్.. పర్మిట్లు, లైసెన్స్ లు లేకుండానే రాకపోకలు...!

రవాణా, పోలీసు, వైద్య శాఖల నిబంధనలకు తూట్లు?

నిబంధనలు ఉల్లంఘించే అంబులెన్స్ లపై ఉక్కు పాదం మోపెనా

బాన్సువాడ, ఆగస్టు 31 (విజయ క్రాంతి): అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్‌లే నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో,పట్టణం, మండల పరిసర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ అంబులెన్స్‌లకు వాహన ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, అవసరమైన పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర నిబంధనలు సక్రమంగా ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అంబులెన్స్‌ల పేరుతో రోగులను తరలిస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ తనిఖీలు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

అత్యవసర సేవల వాహనాల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే అది ప్రజల భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా, ప్రైవేట్ అంబులెన్స్‌ల నిర్వహణ, వాహనాల పరిస్థితి, డ్రైవర్ల అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలపై రవాణా, పోలీసు, వైద్య శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలు ఉంటే వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అంబులెన్స్ లపై అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారా నిబంధనలు పాటించని వాహనాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలపై సంబంధిత శాఖలు స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే అంబులెన్స్ లపై తనిఖీలు చేపట్టి అనుమతులు లేకుండా పత్రాలు లేకుండా లైసెన్సులు లేకుండా నడుపుతున్న వాహనాలపై ఉక్కు పాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రవేట్ అంబులెన్స్లపై ఆర్టీవో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

ఆసుపత్రి పరిసరాల్లో అంబులెన్సుల నిర్వహణపై నిఘా ఏదీ...?

ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో అంబులెన్సుల పేరుతో వాహనాలు నిర్వహిస్తున్నప్పటికీ, వాటికి అవసరమైన పత్రాలు, అనుమతులు సక్రమంగా ఉన్నాయా అనే విషయంపై సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పత్రాలు లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలి

పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రవాణా, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అంబులెన్సుల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ తదితర పత్రాలను పరిశీలించాలని కోరుతున్నారు.

అంబులెన్స్ లు, అత్యవసర వాహనాలపై అధికారుల నిఘా ఎక్కడ...? 

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర వాహనాల భద్రత, నిబంధనల అమలుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాహనాల ఫిట్‌నెస్‌, అనుమతులు, డ్రైవర్ అర్హతలు, భద్రతా ప్రమాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అత్యవసర సేవల పేరుతో నిబంధనలను పక్కనపెడితే ప్రజల భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఆర్టీవో, పోలీసు శాఖలు సమన్వయంతో తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై అధికారులు ఉక్కు పాదం మోపెనా

నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధం కావాలని ప్రజలు కోరుతున్నారు. వాహనాల ఫిట్‌నెస్‌, పర్మిట్‌, పన్నులు,తదితర అంశాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని,ప్రజల భద్రతకు విఘాతం కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను గుర్తించి జరిమానాలతో పాటు అవసరమైన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తనిఖీలు మరింత కఠినతరం చేస్తాం: ప్రదీప్ కుమార్ గౌడ్, ఎంవీఐ, కామారెడ్డి జిల్లావాహనాల పత్రాలు, ఫిట్‌నెస్‌, నంబర్‌ ప్లేట్లు, ఓవర్‌లోడ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్ నిబంధనలు తదితర అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తనిఖీలు మరింత కఠిన తరం చేస్తామని కామారెడ్డి జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ విజయ్ క్రాంతి తో తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రత్యేక వెహికల్ తనిఖీల బృందం తనిఖీలు నిర్వహిస్తుందని తప్పకుండా ప్రైవేట్ అంబులెన్స్ లపై తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.