రోడ్డెక్కిన బస్సులు
మూడు రోజుల సమ్మెతో జనం ఇబ్బందులు
పోరాటంతో హక్కుల సాధన
ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపిన ఏపీఆర్టీసీ యూనియన్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ముగింపు పలకడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. సమ్మెతో మూడు రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో శనివారం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. అయితే తె ల్లవారు జాము నుంచి బస్సు సేవలు పెద్దగా లేవు. ఉదయం ఎనిమిది తర్వాత పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
టీజీఆర్టీసీ ఎంప్లాయీస్‌కు ఏపీఆర్టీసీ అభినందనలు..
పోరాటంతో హక్కులు సాధించిన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీపీటిడి (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో వారి న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వానికి యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించి విజయం సాధించిన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులందరికీ విప్లవ అభినందనలు తెలిపారు.
గత ప్రభుత్వం 2019లో తెలంగాణలో ఆర్టీసీ యూనియన్లను రద్దు చేయడం అనేది దురదృష్టకరమైన చర్యగా పేర్కొంటూ, ప్రస్తుత సమ్మె నేపథ్యంలో యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించడం ఒక శుభ పరిణామమని వారు అభి్ర పాయపడ్డారు. పెండింగ్ వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం ఉద్యోగుల భవిష్యత్తుకు మేలు చేసే నిర్ణయమని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం వారు చేపట్టే ప్రతి పోరాటానికి ఏపీపీటిడి (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.






