11-02-2026 02:26:13 AM
భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్
ముంబై, ఫిబ్రవరి 10 : టీ20 ప్రపంచకప్ లో బిజీగా ఉన్న టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ షాకిచ్చింది. తమ కుటుంబసభ్యులను కూడా అనుమతిం చాలంటూ వారు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. గతంలో ఉన్న నిబంధనలను తొలగించేందుకు బోర్డు అంగీకరించలేదు. ఈ మేరకు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన రిక్వెస్టును ఒప్పుకోలేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని బోర్డు తేల్చి చెప్పింది.
దీంతో ఫ్యామిలీలతో కలిసి ఉండాలనుకున్న భారత ఆటగాళ్ళకు నిరాశే మిగిలింది. గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరాజయం తర్వాత బీసీసీఐ కఠినమైన రూల్స్ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా విదేశీ పర్యటనలు, ఐసీసీ టోర్నీల సమయంలో ఆటగాళ్లతో పాటు కుటుంబసభ్యులు ఉండడంపై ఆంక్షలు విధించింది. 45 రోజుల కం టే ఎక్కువ సమయంలో జరిగే సిరీస్‌లు లేదా టోర్నీలకు రెండు వారాల పాటు కుటుంబ సభ్యులు కలిసి ఉండేందుకు అనుమతి ఇచ్చింది.
అది కూడా ఆటగాళ్లు తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ కు అయ్యే ఖర్చంతా వారే భరించాల్సి ఉంటుంది. అలాగే టీమ్‌తో పాటు ఒకే బస్సులో ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఏ ఒక్క ప్లేయర్ లేదా కోచ్ కూడా సొంత వాహనాల్లో వెళ్లకూడదు. ఖచ్చితంగా టీమ్ బస్సులోనే ప్రయాణించేలా కఠినమైన నిబంధనలు తెచ్చింది.
అప్పటి నుంచీ ప్రతీ సిరీస్‌కు ఈ రూల్స్ ఖఛ్చితంగా అమలు చేస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచకప్ స్వదేశంలోనే జరుగుతుండడంతో కుటుంబసభ్యులను అనుమ తించాలని కోరుతూ హెడ్ కోచ్ గంభీర్ , కెప్టెన్ సూర్యకుమార్ బీసీసీఐకి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై చర్చించిన బీసీసీఐ వారికి విజ్ఞప్తిని తోసి పుచ్చింది. గత రూల్స్‌లో మార్పులు చేసేందుకు అంగీకరించలేదు.