గోలియా తండాలో నిక్షయ్ శిబిర్
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం గోలియా తండా పంచాయతీలో గురువారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో నిక్షయ్ శిబిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు టీబీ లక్షణాలు, నివారణ, చికిత్సపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు వంటి లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
శిబిరంలో టీబీ అనుమానితుల నుంచి కఫం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపడంతో పాటు ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ టీబీ పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, లక్షణాలు ఉన్నవారు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచిత చికిత్స అందుబాటులో ఉందన్నారు. టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ లకావత్ నాకా, పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, ఆరోగ్య విస్తరణ అధికారి బట్టు పున్నమయ్య, ఇల్లందు డివిజన్ క్షయ నివారణ అధికారి శంకర్, ఎక్స్‌రే టెక్నీషియన్ శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజర్ కిరణ్, పంచాయతీ కార్యదర్శి పుష్పరాజ్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






