నూతనంగా ఏర్పాటైన పోలీసు సంఘం
కరీంనగర్ క్రైమ్ఆగష్టు22 (విజయక్రాంతి): పోలీసు సంక్షేమం కోసం కరీంనగర్ జిల్లాలో నూతనంగా పోలీసు సంఘం కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు శ్రీ ఏ. సతీష్ మరియు ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీమతి శైలజ, పీసీ, శ్రీ ఎం.డి. అఫ్జల్, పీసీ తదితర కార్యవర్గ సభ్యులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రీ నిరంజన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి నూతనంగా ఎన్నికైన జిల్లా పోలీసు సంఘం కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం నూతనంగా ఏర్పాటైన పోలీసు సంఘానికి తన పూర్తి సహాయ సహకారాలు, మద్దతు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.
పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎదురవుతున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసు సంఘం కృషి చేయాలని సీఐ సూచించారు. ముఖ్యంగా పోలీసు సిబ్బందికి మెరుగైన వైద్య సదుపాయాలు, వారి పిల్లల విద్యకు సంబంధించిన సమస్యలు, ఇతర సంక్షేమ అంశాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన పోలీసు సంఘం కార్యవర్గం పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందనే ఆశాభావాన్ని సీఐ నిరంజన్ రెడ్డి వ్యక్తం చేశారు. జిల్లా పోలీసు సంఘం కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు.






