calender_icon.png 4 February, 2026 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ

04-02-2026 12:00:00 AM

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా బహుళ ప్రయోజనాలు

వస్తు సుంకం ౧౮ తగ్గుదల గొప్ప విజయం

ఎన్డీయే ఎంపీల పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో మంగళవారం నేషనల్ డెమోక్రాటిక్ కూటమి (ఎన్డీయే) ఎంపీలతో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా విధిస్తున్న వస్తు సుంకం 18 శాతానికి తగ్గడం భారత ఎగుమతిదారులకు లభించిన గొప్ప విజయమని అభివర్ణించారు. కొనియాడారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయంగా తయారీ రంగం బలోపేతం అవుతుందని ప్రధాని ఆకాంక్షించారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన ముద్ర వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సహనంతో వ్యవహరించి వేచి చూసినందు వల్లే అమెరికా నుంచి భారత్‌కు అనుకూలమైన ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు. తాము విమర్శలకు కుంగిపోమని, సరైన సమయంలో సరైన సమాధానం చెప్తామని పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంపీలందరూ పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను సామాన్యులకు వివరించాలని సూచించారు. యువతకు, రైతులకు బడ్జెట్ ద్వారా కలిగే లాభాలను తెలియజేయాలని ఉద్బోధించారు. 

ప్రధానికి ఘన సన్మానం

భారత్ -అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రధాని మోదీని ఎన్డీయే ఎంపీలు ఘనంగా సన్మానించారు. ప్రధాని సభా ప్రాంగణంలోకి రాగానే చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దౌత్య నీతిని అమోఘమని కీర్తించారు. మోదీ సహనంతో వ్యవహరించడం వల్లే అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారమైందని కొనియాడారు. ఏదేమైనా.. యూరోపియన్ యూనియన్, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త జోష్ నిచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో ఒప్పందాలు దేశ పురోగతికి ఊతమివ్వనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.