8 March, 2026 | 12:05 PM

యూజీ, పీజీ కోర్సుల్లో ఎన్‌ఈపీ

08-03-2026 12:00 AM
  1. 2026- విద్యాసంవత్సరం నుంచి అమలు

సీపీగెట్ నిర్వహణ బాధ్యతలు కాకతీయ వర్సిటీకు

విద్యామండలి నిర్ణయం

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో యూజీ, పీజీ కోర్సుల్లో 2026 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) అమలుచేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం చైర్మన్ వీ బాలకిష్ట రెడ్డి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించిన వంద రోజుల ప్రణాళికతోపాటు ముఖ్యమైన విద్య, విధాన పరమైన అం శాలపై చర్చించారు.

ఈ సమావేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలును ఏకగ్రీవం గా ఆమోదించినట్లు బాలకిష్టారెడ్డి తెలిపారు. కాగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల విషయం లో మూడు సంవత్సరాల డిగ్రీకి కనీసం 120 క్రెడిట్లు, నాలుగు సంవత్సరాల హానర్స్ లేదా హానర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీకి 160 క్రెడిట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కనీసం 80 క్రెడిట్లు ఉండే విధంగా క్రెడిట్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించామన్నారు.

అదేవిధంగా మైనర్ డిగ్రీలు, క్రెడిట్ నిర్మాణం, క్రెడిట్ బది లీ విధానం, మల్టీడిసిప్లినరీ ప్రోమ్‌లు, మల్టిపుల్ ఎంట్రీమల్టిపుల్ ఎగ్జిట్ విధానం అమలు కు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు సంప్రదాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సిలబస్ రూపకల్పన, క్రెడిట్ కేటాయింపు, థియరీ, ప్రాక్టికల్స్, ల్యాబ్లు, ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్‌లకు అవసరమైన బోధనా గంటల నిర్ణయానికి సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలను ఆమోదించినట్లు బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు.

2026 విద్యాసంవత్సరానికి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీ గెట్) నిర్వహణ బా ధ్యతను కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు బాలకిష్టారెడ్డి తెలిపా రు.  సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌లు ప్రొఫెసర్ ఈ పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్ కే మహ్మూద్, ఓయూ వీసీ కుమార్ మొలుగారం, కేయూ బీసీ కర్నాటి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ యాదగిరి రావు, మహాత్మాగాంధీ వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్, పాలమూరు వర్సిటీ  వీసీ జీఎన్ శ్రీనివాస్, శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ యూ ఉమేశ్ కుమార్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ సూర్య ధనంజయ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు.