1 July, 2026 | 2:50 AM

రచ్చకట్టపై ‘రాజకీయ’ గొడ్డలిపెట్టు

01-07-2026 01:51 AM
  1. వందల ఏళ్ల చరిత్రను మట్టిలో కలిపేస్తారా?
  2. కూల్చివేతపై రాజకీయ నేతల ‘మౌన వ్రతం’.. 
  3. తెరవెనుక భూస్వాముల వారసులతో కుమ్మక్కు?
  4. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, యువజన సంఘాలు
  5. తాతల కాలం నాటి రచ్చ కట్టను కాపాడుకుంటామని గ్రామస్తుల ప్రతిన

ఆమనగల్లు, జూన్ 30 (విజయక్రాంతి): ఊరి గుండెకాయ లాంటి ‘రచ్చకట్ట’.... పట్టణం నడిబొడ్డున.. వందల ఏళ్ల నాటి నుంచి ఆ ఊరి చరిత్రకు, సంస్కృతికి సజీవ సాక్ష్యంగా నిలిచింది ఆ రచ్చకట్ట. గ్రామంలో చిన్న పంచాయతీ మొదలుకొని, ఊరి సంబరాలు, పండుగలు, వినాయక చవితి వంటి ఏ ఉత్సవమైనా సరే.. మొదట ఆ రచ్చకట్ట నుంచే అంకురార్పణ జరగడం కొన్ని శతబ్దాలుగా వస్తున్న అనవాయితీ.

 నాటి పెద్దలు ఎంతో దూరదృష్టితో, ప్రజలందరి సౌకర్యార్థం అందరికీ అందుబాటులో ఉండేలా ఈ రచ్చకట్టను తీర్చిదిద్దారు. గత కొన్ని ఏళ్లుగా పద్మశాలి యూత్ అసోసియేషన్ వారు ఇక్కడే ప్రతిష్టాత్మకంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాంటి ఊరి గుండెకాయ లాంటి స్థలాన్ని రాత్రికి రాత్రే కూల్చివేయడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.

భూముల ధరలు పెరిగాయని.. భూస్వాముల కన్ను!

అప్పట్లో గ్రామానికి చెందిన ఒక భూస్వామికి చెందిన స్థలంలో.. నాటి పాలకులు ఆయనతో మాట్లాడి, ఒప్పించి ప్రజా ప్రయోజనాల కోసం ఈ రచ్చకట్టను ఏర్పాటు చేశారు. అయితే, కాలక్రమేణా ప్రస్తుత మార్కెట్లో ఆ ప్రాంతంలో భూముల విలువలు కోట్ల రూపాయలకు పెరగడంతో.. ఆ భూస్వామి వారసుల బుద్ధి మారింది. పూర్వీకులు ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఎలాగైనా మళ్లీ తమ హస్తగతం చేసుకోవాలని కుట్రలకు తెరలేపారు. విలువైన ఈ ప్రజా స్థలాన్ని తమ హస్తగతం చేసుకోనేందుకు కొందరు  ఊరి పెద్దలే మధ్యవర్తులుగా  మారి రంగంలోకి దిగారని గ్రామస్తులు నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

అధికార, ప్రతిపక్షాల ‘మౌన’ముద్ర 

ఈ కూల్చి వెత పై నోరు విప్పాల్సిన అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దలు.. ఇప్పుడు ‘మౌన ముద్ర’ దాల్చడం వెనుక అంతర్యం ఏమిటని అనుమానాలువ్యక్తమవుతున్నాయి. రచ్చకట్ట కూల్చివేతలో తెరవెనుక ఉండి, తమ అనుచర గణంతో భూస్వామి వారసులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, వారికి వత్తాసు పలుకుతున్నారని మున్సిపాలిటీ ప్రజలు మండిపడుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు.. ఊరి సంపదను, చరిత్రను నాశనం చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

‘తమ తాతల కాలం నాటి నుంచి ఊరి పెద్దలంతా కూర్చుని పంచాయితీలు చేసిన, పండుగలు చేసుకున్న రచ్చకట్టను ఇలా ఊరు లేకుండా చేయడమేంటి? కొందరు నేతల స్వప్రయోజనాల కోసం ఇంతటి అరాచకానికి ఒడిగడతారా?‘ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.

సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న యువజన సంఘాలు..

రచ్చకట్ట కూల్చివేత వార్త తెలియగానే గ్రామంలోని పలు యువజన సంఘాలు, అంబేద్కర్ సంఘం నాయకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ అన్యాయమైన చర్యపై వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కొందరు స్వార్థ నాయకుల సొంత లాభాల కోసం వందల ఏళ్ల చరిత్ర కలిగిన కట్టడాన్ని ఎలా కూలుస్తారని వారు నిలదీస్తున్నారు. గ్రామ పెద్దలు ముందుండి ఈ అక్రమ కూల్చివేతపై గళం విప్పాల్సింది పోయి, కూల్చివేత దారుల పక్కన చేరి వారికి వత్తాసు పలకడం ఏమిటని మున్సిపాలిటీ ప్రజలు నిలదీస్తున్నారు.

ఈ చారిత్రక రచ్చకట్టను తిరిగి యథావిధిగా పునరుద్ధరించేందుకు ప్రజలంతా కలిసి ఉద్యమిస్తామని యువజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  రచ్చకట్ట స్థలాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నోటీసులు జారీ చేశాం..

పట్టణంలో ఇటీవల జరిగిన రచ్చకట్ట కూల్చివేత ఘటనపై  మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి స్పందించారు.రచ్చకట్ట కూల్చివేతకు కారణమైన సంబంధిత వ్యక్తులకు ఈ నెల 25వ తేదీన అధికారికంగా నోటీసులు జారీ చేశామని, నోటీసులు అందుకున్న వ్యక్తులు ఇచ్చే వివరణ ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు.