28 February, 2026 | 7:46 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

28-02-2026 05:11 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల ఆధ్వర్యంలో శనివారం వివిధ శాస్త్రీయ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ... జాతీయ సైన్స్ దినోత్సవం వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనాశక్తి, పరిశోధనా ధోరణి పెంపొందించేందుకు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు.

బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల ప్రదర్శనలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. నేటి యువత శాస్త్రాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని సూచించారు. సహజ వనరులను వినియోగించి రంగులు తయారు చేసిన విద్యార్థులను అభినందిస్తూ, ఇలాంటి సృజనాత్మక ప్రయోగాలు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయని తెలిపారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ విభాగ అధ్యాపకురాలు మాట్లాడుతూ ‘నేచురల్ కలర్స్’ తయారీపై విద్యార్థులు ఆకర్షణీయమైన ప్రదర్శన ఇచ్చారని చెప్పారు.

పూలు, మొక్కల నుంచి సహజ రసాయనాలను సేకరించి పర్యావరణానికి హాని కలగకుండా వివిధ వర్ణాలు తయారు చేయవచ్చని వివరించారు. సహజ రంగులు మన చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించవని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థిని అనుష మాట్లాడుతూ, నిత్యజీవితంలో ఉపయోగించే రకాల ధాన్యాలు—రాగులు, ఉదలు, సామలు, అరికెలు, కొర్రెలు, మొక్కజొన్న-మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో, వాటి శాస్త్రీయ విలువలను తన ప్రదర్శనలో వివరించిందని తెలిపింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహ, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.