నాగుల పంచమి ఉత్సవాలకు సిద్ధమైన నాగోబా
రేపే నాగుల పంచమి...
నాగోబా ఆలయం ప్రాంగణంలో మినీ జాతర..
నాగుల పంచమి ఉత్సవాలకు సిద్ధమైన నాగోబా
ఉట్నూర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): శ్రావణమాసంలో వచ్చే మొదటి పండుగ అయిన నాగుల పంచమి(Nagula Panchami) ఉత్సవాలకు ఆదివాసులు ఆరాధ్య దైవం నాగోబా ముస్తాబయింది. నాగుల పంచమి రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేసేందుకు వేదికైనా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని ఆదివాసులు ఆరాధ్య దేవుడు నాగోబా ఆవరణలో మినీ జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగుల పంచమి రోజున నాగోబాను దర్శించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం మెస్రం వంశీయులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
నాగుల పంచమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహించుటకు నాగోబా యువజన సంఘం సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నాగుల పంచమి కి వేలాదిగా భక్తులు తరలి రావడంతో నాలుగు గంటల పాటు ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు మూడు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలిసిన సీఐ మాడవి ప్రసాద్, ఎస్సై సాయన్నలు ఈసారి నాగుల పంచమి సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. నాగుల పంచమి ఉత్సవాల సందర్భంగా దేవుడి పూజలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు తెలిపారు.






