ఉస్తాద్‌తో నా కల నెరవేరింది!
‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీలీల కథానాయికలు. ఉగాది కానుగా మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో కథానాయిక రాశి ఖన్నా సోమవారం
మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సినిమా విశేషాలు, ఇతర సంగతులు ఆమె మాటల్లోనే..
నా జీవితం ఇప్పుడు చాలా బిజీగా ఉంది. నిజం చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశా. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే, పవన్ కళ్యాణ్ స్టార్డమ్ గురించి, పవనిజం గురించి విన్నా. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నా కల నెరవేరింది.
ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్లోక. తను చాలా మోడరన్ అమ్మాయి. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. నా పాత్రకు కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశా.
పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ పర్సన్. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. మీరు నటి కావాలని ముందే అనుకున్నారా? అని మొదటిరోజే నన్ను అడిగారు. లేదు సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని ఆయనతో చెప్పా. ఆయన తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజాసేవ చేయమని చెప్పారు. పవన్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నా. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది.
‘గబ్బర్ సింగ్’ సినిమా లాగే చాలా వినోదాత్మకంగా ఉంటుందీ చిత్రం. ఇందులో వింటేజ్ పవన్ కల్యాణ్‌నూ చూడొచ్చు. ఇది ఒక ఫ్యామిలీ సినిమా.
పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీశ్ శంకర్ ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పా. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పనిచేశా.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటాం. శ్రీలీల, నాకు కలిపి సన్నివేశాలు లేవు. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. నా పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి.
మైత్రీ మూవీస్.. సినిమా కోసం ప్రాణం పెట్టే నిర్మాతలు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఆ బ్యానర్‌లో మళ్లీ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా.
ప్రస్తుతం హిందీలో అక్షయ్‌కుమార్‌తో ఒక సినిమా, ‘ఫర్జీ 2’ షో చేస్తున్నా. అమెజాన్ సిరీస్‌లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నా.. అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్‌లో ‘రౌడీ అండ్ కో’ చేస్తున్నా. తెలుగులో కొన్ని కథలు వింటున్నా.




