కుక్కల బెడద నివారణకై మటన్ మార్కెట్ తరలింపు
- షబ్బీర్ అలీ తరపున 5 లక్షలు
- ఎంపీ సురేష్ శెట్కార్ తరపున 5 లక్షలు
- శాశ్వత మార్కెట్ నిర్మాణానికి కటికే సోదరులకు హామీ ఇచ్చిన సర్పంచ్ నరసయ్య
దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో మటన్ మార్కెట్ వద్ద పిచ్చి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, సోమవారం ఆరుగురు పై దాడి చేయడంతో వారు కామారెడ్డి, హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కుక్కల బెడద నివారణ చేయడానికి మటన్ మార్కెట్ ను రైతు వేదిక వద్ద ఉన్న గ్రామపంచాయతీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ ఐరెని నరసయ్య మంగళవారం తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో సర్పంచ్ జిపిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కటిక సంఘం సభ్యులతో మాట్లాడి మటన్ మార్కెట్ ను రైతు వేదిక వద్దకు తరలించేందుకు ప్రణాళికను తయారు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తరపున 5 లక్షలు, ఎంపీ సురేష్ శెట్కర్ తరపున 5 లక్షల ను మంజూరు చేయించి శాశ్వత మాడిగల నిర్మాణానికి కృషి చేస్తానని కటిక సోదరులకు సర్పంచ్ నర్సయ్య హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మడిగేలను కటికే దుకాణదారులు రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. శాశ్వత మాడిగల నిర్మాణానికై ఆరు నెలల సమయంలో పనులు పూర్తి చేయిస్తామన్నారు.
తాత్కాలికంగా రైతు వేదిక వద్ద మటన్ మార్కెట్ ఏర్పాటుకు బోరు మోటర్ తో పాటు 2000 లీటర్ల వాటర్ ట్యాంక్ ను ప్రజల సౌకర్యార్థం తక్షణమే గ్రామపంచాయతీ నుండి ఏర్పాటు చేయిస్తామని, ఆరు నెలల్లోపు అక్కడే పర్మినెంట్ నిర్మాణాలు చేపట్టి కటిక సోదరులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. దోమకొండ మటన్ మార్కెట్ పెద్దది కావడంతో భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, జంగంపల్లి పెద్ద మల్ల రెడ్డి తో పాటు ఇతర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మటన్ తీసుకెళ్తుంటారని ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ వద్ద వాహనాలు కూడా పార్కింగ్ చేయడానికి స్థలం లేక నాలుగు దారులు ట్రాఫిక్ తో జామ్ అవుతుందని అన్నారు.
అందువలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇట్టి నిర్ణయం పాలకవర్గ సభ్యులతో కలిసి తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా పిచ్చికుక్కలు కనిపిస్తే పాలకవర్గ సభ్యులకు తెలియజేయాలని, వాటిని పట్టుకొని తరలించేందుకు ప్రయత్నిస్తామని సర్పంచ్ వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు శేఖర్,, అమర్నాథ్, శ్రీనివాస్, సుధాకర్, ఎల్లయ్య, కటిక సంఘం సభ్యులు హరిలాల్, బాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




