26 July, 2026 | 4:59 PM

ఇకనైనా మా బకాయిలు చెల్లించండి

26-07-2026 04:00 PM

తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 

ముకరంపుర,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల, కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన కార్మికులు మరియు ఉద్యోగులకు రావాల్సిన వేతన సవరణ మరియు ఇతర బకాయిల చెల్లింపులపై కరీంనగర్లో  పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జోన్ అధ్యక్షులు ఓరుగంటి రమణారావు మాట్లాడుతూ... 2017లో జరగాల్సిన పే రివిజన్‌ను 7 సంవత్సరాల ఆలస్యంతో 2024లో చేపట్టారు.​

అలాగే 2021లో జరగాల్సిన మరో పే రివిజన్‌ను 5 సంవత్సరాల ఆలస్యంగా 2026లో అమలు చేశారు. ​ఈ ఆలస్యం వల్ల సాధారణ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.దాదాపు 15,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు పే స్కేల్ రివిజన్  బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.​ఈ బకాయిలు అందకుండానే ఇప్పటికే సుమారు 300 నుండి 350 మంది ఉద్యోగులు చనిపోయారని పేర్కొన్నారు. ​

కష్టపడి సంపాదించిన సొమ్మును అనుభవించకుండానే చనిపోవడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.​ప్రభుత్వం నుంచి ప్రతి ఉద్యోగికి దాదాపు 6 లక్షల నుండి 10 లక్షల వరకు  బకాయిలు రావాల్సి ఉందన్నారు.​ఈ బకాయిలు దాదాపు 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, కేవలం వీటి వడ్డీతోనే ప్రభుత్వం గడపవచ్చని విమర్శించారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించకపోతే, ఆగస్టు 4న బస్ భవన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు