26 July, 2026 | 4:48 PM

జిల్లాలో విత్తన మేళాలతో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

26-07-2026 04:05 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 27 నుండి 29 వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ఈ మేళాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

వరి సాగుకు బదులుగా కంది, పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేస్తే రైతులు వర్షాభావ పరిస్థితుల్లోనూ నష్టపోకుండా లాభపడవచ్చని సూచించారు. భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, కాటారం, మహదేవ్‌పూర్ తదితర ప్రాంతాల్లో మేళాలు నిర్వహించబడతాయని తెలిపారు. రైతులు సమీప రైతు వేదికలను సందర్శించి వ్యవసాయ అధికారుల సూచనలతో నాణ్యమైన విత్తనాలు పొందాలని ఆయన కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.