15 వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి పర్యటన
- వార్డు సమస్యలు విన్న వించిన కౌన్సి లర్ వసంత
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం 15 వ వార్డు టేకులబస్తీ లో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి బుధవారం పర్యటించారు. వార్డులో 10 ఏళ్ళు గా పేరుకు పోయిన సమస్యలను ఈసందర్బంగా కౌన్సిలర్ చింతల వసంత కమిషనర్ కు విన్నవించారు. వార్డులో డ్రైన్ పూడిక తీపించాలని , వార్డులోని స్లమ్ ఏరియాలో రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డులో వీధుల్లో సీసీ రోడ్డు మంజూరు చేయాలని, అన్ని గల్లీల్లోనూ మురికి కాలువలు నిర్మించాలనికోరారు.
అవసరం ఉన్న చోట విద్యుత్ స్థంబాలు వేయించాలని,వార్డులో కొన్ని వీధుల్లో మున్సిపల్ నల్ల పైప్ లైన్లు లేవని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. త్రాగు నీటి సరఫరా పైపు లైన్లు వేయాలని ఇంటింటా నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ కమిషనర్ ను కోరారు. మున్సిపల్ కమిషనర్ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ తొలగించేందుకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ తో మాట్లాడి క్లియర్ చేయిస్తానన్నారు. 15వ వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ద్వారా జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదించనున్నట్లు హామీ ఇచ్చారు. వార్డు లో చెత్త సేకరణ కు వచ్చే ఆటో ట్రాలీలో మాత్రమే చెత్త వేయాలని ప్రజలను కోరారు. రోడ్డు పై చెత్త వేస్తే వారి పై జరిమాన విధిస్తామన్నారు. కమిషనర్ పర్యటనలో మున్సిపల్ శానిటర్ ఇన్స్పెక్టర్ సునీల్, శానిటరీ జవాన్ లు ఇంద్రపాల్, రామస్వామి ఉన్నారు.




