16-02-2026 12:00:00 AM
చేయ్యి జిక్కుతుందా!
కారు ఎక్కుతుందా!
నేడు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
ఉత్కంఠకు తెరపడనుందా?
కుమ్రం భీం ఆసిఫాబాద్ ఫిబ్రవరి 15(విజయక్రాంతి): మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సోమవారం జరగనున్న నేపథ్యం లో మున్సిపల్‌పై ఏజెండా ఎగురుతుందన్న ఉత్కంఠ నెలకొంది.ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 9 బిఆర్‌ఎస్,7 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా 4 స్వతంత్రులు గెలిచారు.రెండు పార్టీలకు కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో బిఆర్‌ఎస్ కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు మొద లుపెట్టాయి.
స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రయత్నాలు చేయగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాం నాయక్,మాజీ డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు స్వతంత్ర అభ్యర్థులను క్యాంపుకు తరలించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే నలుగురు కౌన్సిలర్ల మద్దతు అవస రం ఉంది. బీఆర్‌ఎస్‌కి ఒక్క కౌన్సిలర్ వస్తే సరిపోతుంది. ఒక అభ్యర్థి కోసం కోవలక్ష్మి ఇప్పటికే లాభం మొదలుపెట్టింది.
కాంగ్రెస్ మాత్రం స్వతంత్రులు తమకే మద్దతు తెలుపుతున్నారని పీఠాన్ని కైవసం చేసుకుంటా మని ధీమా వ్యక్తం చేస్తున్నారు.వైస్ చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతామని స్వతంత్ర అభ్యర్థులు పట్టుపట్టడంతో ఎవరికి ఆ పదవి కేటాయించాల అనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం పడింది.దీనికి తోడు చైర్మన్ అభ్యర్థి ఖరారు విషయంలోనూ తీవ్ర ఒత్తిడిని అభ్యర్థులు నాయకు లపై తీసుకువస్తున్నారు.
స్వతంత్రుల దోబూచులు..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 20 వార్డులు ఉండగా అందులో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.చైర్మన్ ఎన్నికకు వారి మద్దతు అనివార్యం కావడంతో వారి వెంట అధికార పార్టీ నాయకు లు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కోవలక్ష్మి గత మూడు రోజులుగా చెక్కర్లు కొడుతున్నారు.స్వతంత్రులు మాత్రం ఎవరు వెళ్లిన తమ మద్దతు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.క్యాంపు లో ఉన్న అభ్యర్థు లు సైతం ఆ పార్టీకే మద్దతు పలుకుతారా అనే విషయంలోనూ కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్యాంపులో ఉండి తమ కుటుంబ సభ్యులతో,స్నేహితులతో ఇతర పార్టీల నాయకుల బేరసారాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమకు అనుకున్నట్లుగా పదవి కేటాయించిన వారికే మద్దతు పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. బిఆర్‌ఎస్‌కి మాత్రం వైస్ చైర్మన్ పదవి కేటాయించేందుకు సిద్ధంగా ఉండడంతో మద్దతు తెలిపే అభ్యర్థికి లైన్ క్లియర్గా ఉంది.చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో సొంత పార్టీ కౌన్సిలర్లను సైతం నమ్మే పరిస్థితిలో ఆ నాయకులు లేరు.
ఏ సమయంలో ఏం జరుగుతుందన్న టెన్షన్ రెండు పార్టీలలో నెలకొంది. కాంగ్రెస్ మైనార్టీలకు చైర్మన్ కేటాయిస్తున్నట్లు గతంలో జరిగిన ప్రచారంతో ఎన్నిక నేపథ్యంలో కొంతమంది కౌన్సిలర్లు మైనార్టీకి కాకుండా తమకు ఇవ్వాలని కౌన్సిలర్లు కాంగ్రెస్ పెద్ద నాయకులను ఒత్తిడి చేస్తున్నారు.కాంగ్రెస్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదులుతుండగా వారికి చైర్మ న్, వైస్ చైర్మన్ పదవుల కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది.చైర్మన్ ఎన్నికకు పూర్తిస్థాయిలో మెజార్టీ లేకపోవడంతో స్వతంత్రుల డిమాండ్ పెరిగిపోయింది.
ఉత్కంఠకు తెరపడనుందా..!
ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పా టు అయిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార, ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటాపోటీన ప్రచారాలు నిర్వహిస్తూ వారి అభ్య ర్థుల గెలుపునకు విశ్వ ప్రయత్నాలు చేశారు. రెండు పార్టీలకు కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది.ఎన్నికల్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
13న ఎన్నికల రిజల్ట్ రోజు ఒక టో వార్డు స్వతంత్ర అభ్యర్థి జాడి వినోద్ మద్దతు కోసం వెళ్లిన రెండు పార్టీల మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. రాజకీయ పరిణామాల మధ్య వినోద్ ను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీర స్వామి నాయక్ ఆటోలో ఎక్కించుకొని వెళ్లిన విషయం తెలిసిందే.అనంతరం ఆయన చెర నుండి బయటకు వెళ్లిన వినోద్ మళ్లీ కాంగ్రెస్ పార్టీ క్యాంపులో ఉన్నట్టు సమాచారం. స్వతంత్రులుగా గెలిచిన నలుగురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన వారే అవడం విశేషం. వారు గెలిచిన తర్వాత అభ్యర్థుల వద్దకు మొదట వెళ్లిన వారిపై స్వతంత్రులు వారి మద్దతుదారులు ఆందోళనకు దిగారు.