calender_icon.png 10 February, 2026 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ప్రచారానికి తెర

10-02-2026 12:19:05 AM

  1. తెర చాటున డబ్బు, మద్యం పంపిణీ షురూ..
  2. ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలకు కక్కిస్తున్న స్వతంత్రులు
  3. త్రిముఖ పోటీతో ఎవరి ధీమా వారిదే
  4. భారీగా డబ్బు మద్యం పంపిణీకి ఏర్పాట్లు
  5. పోలీసుల నిఘా వైఫల్యం

నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఇక ఎన్నిక సమయం ఒక్క రోజే మిగిలి ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపు కో సం ఎలాగైనా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తెర చాటున భారీగా మద్యం, డబ్బు వెండి గిన్నెలు, స్వీట్ బాక్స్ వంటి వాటిని పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొదటి, రెండో దఫా గెలిచి ప్రస్తు తం అభ్యర్థులుగా పోటీలో ఉన్న మాజీ కౌ న్సిలర్లను ఈసారి ఓటమి భయం వెంటాడుతోందని పంపిణీ పర్వం రెట్టింపు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఖబ్జా చేసి కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన డబ్బుతో మళ్ళీ అధికా రంలోకి వచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పరిస్థితి. భారీగా డబ్బు అహంకారం తో రాజకీయ చతురత ఉపయోగిస్తూ సునాయసంగా గెలుపొందడం కోసం కులాల వా రిగా తాయిలాలు ప్రకటించి ఒక్కో ఓటు ధర నిర్ణయిస్తూ పదివేలకు పైగా పంపిణీ చేస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.

కులాల వారిగా భవన నిర్మాణం కోసం ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణమైన వ్యక్తులకే అధికార పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆ పార్టీ ముఖ్య నేతలు ఆశావాహులు నిరుత్సాహం తో ఉన్నారు. పార్టీ టికెట్ ఆశించి భంగపడి స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహిస్తూ తమ సత్తా చాటుతుండడంతో అధికార కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థు లు, ముఖ్య నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

వారితోపాటు కమలం పార్టీ కూ డా మేమున్నామంటూ గట్టి పోటీ ఇస్తుండడంతో ఎవరికి నష్టం జరుగుతుందా అన్న భయం నెలకొంది. మరి కొన్ని వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం గులాబీ, క మలం పార్టీలు తెరచాటుగా ఒకటైనట్లు చర్చ జరుగుతుంది. 

అధికార పార్టీలో మౌనరాగం..!

తెలంగాణ ఉద్యమం అనంతరం పదేళ్లుగా టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర ఒత్తి ళ్లు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అహోరాత్రులు శ్రమించారు. తీరా అధికారంలోకి వచ్చాక కష్టపడ్డ వారికే అవకాశం దక్కుతుందంటూ చెప్పుకొచ్చి చివరికి గత బి ఆర్ ఎస్ పార్టీ ఓటమికి కారణమైన అవినీతి భూ ఆక్రమణదారులను చెంతన చేర్చుకొని అందలం ఎక్కించడంతో ప్రస్తు తం కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. 

స్థానిక ఎమ్మెల్యే కూచుపుల్ల రాజేష్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యర్థి వద్ద తగించి కొట్లాడిన వారికి కూడా ప్రాధాన్యత దక్కకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో మౌనరాగం వీస్తోంది. ప్రచారంలో కలిసి రావాలని ఒత్తిడి తెచ్చిన ఆశించిన స్థాయిలో జనంలోకి రాకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రభావం ఓటమి అంచు వరకు వెళ్తోందని చర్చ జరుగుతుంది. దీంతోపాటు ముఖ్య నేతలను కాదని నాలుగు గోడల మధ్య జరిపిన అభ్యర్థుల ఎంపిక పట్ల నిరుత్సాహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించడంలోనూ విఫలమయ్యారని తెలుస్తోంది.

మరోపక్క పోటీలో ఉన్న స్వతంత్రులు కూడా ఎక్కువగా అధికార పార్టీనే టార్గెట్ చేస్తూ క్రాస్ ఓటింగ్ కోసం అడుగులు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ప్రతి ఇంటికి కాలికి బలపం కట్టినట్లు తిరిగినా ఆశించిన స్థాయిలో ప్రతిఫలం దక్కేల లేదంటూ ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకోవడం విశేషం.

మరోపక్క బిజెపి పార్టీ కూడా అధికార పార్టీ అభ్యర్థులు గెలవగలిగే స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుండడంతో లాభనష్టాలు ఎవరి వైపు ఉంటాయో నన్న ఆందోళన మొదలైంది. అధికార పార్టీ ప్రచారంలోనూ వెనుకబడిందన్న వాదన వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్ల పాల నలో తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీ పూర్తిగా విఫలమైందన్న వాదన వినిపిస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాగా పేరుందిన ప్రాంతంలో మున్సిపాలిటీ ఎన్నికలు ప్రత్యేక శ్రద్ధ చూపి అత్యధిక స్థానాలు గెలుపొందాలని చెప్తున్నప్పటికీ ఈ ప్రాంతంలోని ముఖ్య నేతలు ఆ స్థాయిలో ప్రచారం నిర్వహించడంలో వెనుకబడ్డారని వాదన వినిపిస్తోంది. ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి కూడా కేవలం ఒక్కరోజు ఇలా వచ్చి వెళ్లిపోయారు. మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు ఒకరోజు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. 

ఎంపీ మల్లు రవి పదో వార్డులో మాత్రమే ప్రచారంలో కనిపించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ రెండు రోజులపాటు పర్యవేక్షణ జరిపి కొంతమేర అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు మాత్రమే తీవ్రంగా శ్రమిస్తున్నారు.

టిఆర్‌ఎస్ పార్టీలోనూ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి సతీమణి మర్రి జమున మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా గెలుపొందడం కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు పెడుతున్న పరిస్థితి. అయినప్పటికీ సంబంధిత అధికారులు నిఘ పూర్తిగా విఫలమైందని చర్చ జరుగుతుంది. ఒక్కో అభ్యర్థి సుమారు 30 నుండి 60 లక్షల దాకా ఖర్చు చేస్తున్నప్పటికీ మద్యం డబ్బు పంపిణీ జరిగినట్లు పట్టుబడకపోవడం విశేషం.