28 March, 2026 | 7:52 PM

తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో

28-03-2026 05:57 PM

చివ్వెంల మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరీక్షలు – పూర్తి హాజరు

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని ఎంఆర్వో చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. కేంద్రంలో అమలవుతున్న “జీరో మొబైల్ జోన్” విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అనుకూల పరిస్థితులు కల్పించడం సిబ్బంది కృషి ఫలితమని అభినందించారు. తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి ప్రాథమిక సౌకర్యాలను కూడా ప్రత్యేకంగా తనిఖీ చేసి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా, చివ్వెంల మండలంలోని మూడు పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన ఎస్సెస్సీ పరీక్షలు ప్రశాంతంగా సాగినట్లు మండల విద్యా అధికారి (ఎంఈఓ) తెలిపారు. మండలంలోని అన్ని కేంద్రాల్లో పరీక్షలు ఎటువంటి అంతరాయాలు లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్నాయని అధికారులు వెల్లడించారు.