21 April, 2026 | 1:17 AM

త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

21-04-2026 12:00 AM

రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం

ఓటర్ల జాబితా సిద్దం చేయాలని 

అధికారులకు ఆదేశించిన ఈసీ

గ్రామాల్లో ప్రారంభమైన రాజకీయ వేడి..?

ఖమ్మం, ఏప్రిల్ 20(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది.. అతి త్వరలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. ఈ మేరకు ఎన్నికల నిర్వాహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. అందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.. మొదటి దఫాగా ఓటర్ల జాబితాను సిద్దం చేసే పనిలో నిమగ్నమైంది. ఈనెల 23 వరకు ముసాయిదా జాబితాను సిద్దం చేయాలని తెలంగాణ పంచాయతీ రాజ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సవరించిన జాబితాను సిద్దం చేసి, త్వరలో ప్రచురితం చేయాలని సూచించింది. దీంతో ఒక్క సారిగా రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వాడివేడీ ప్రారంభమైంది. 

మరోసారి  స్థానిక ఎన్నికలు జరిగే వాతావరణం కనిపిస్తోంది. దీంతో పల్లెల్లో రాజకీయ వాడీవేడి ప్రారంభమైనట్లైంది.  రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు  పుకార్లు షీకార్లై ప్రచారం చేశాయి. సోషల్ మీడియాలో, టీవీలలో, పత్రికల్లో ఈ వార్తలు చెక్కర్లు కొట్టాయి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉండవు, సర్పంచులందరు కలిసీ ఎంపీపీ, వారందరు కలిసి జడ్పీచైర్మన్ ను ఎన్నుకుంటారు. అందుకే రాబోయే కాలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉండవు అనే ప్రచారం జోరుగా సాగింది.. దీంతో రాజకీయ నాయకులు, ఆశావాహులు ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఆశలు వదులుకున్నారు. ఈ తరుణంలో ఈసీ నిర్ణయం అందర్ని అశ్ఛర్యానికి గురిచేసింది.

ఓటర్ల జాబితాలను నవీకరించాలని జిల్లా అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఎన్నికలపై ఆశలు వదులుకున్న రాజకీయ నాయకులు, ఆశావాహులు, కార్యకర్తలు ఒక్కసారిగా నిద్రలేచిన పులిలా కనిపించారు. పల్లెల్లో ఎంపీటీసీ ఎన్నికల గురించి జోరుగా చర్చ ప్రారంభమైంది. సోషల్ మీడియాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించుకుంటున్నారు. మొత్తానికి మండు ఎండల్లో పల్లెల్లో రాజకీయ వేడీ ప్రారంభమైనట్లే కనిపిస్తోంది.. 

గతేడాది జరగాల్సి ఉండగా..?

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని భావించింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలను నిర్వహించాలని అనుకుంది. అందుకు సంబంధించి అక్టోబర్ 8,2025న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు 2 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు ఐదు నామినేషన్లు దాఖలైయ్యాయి.

కానీ బీసీ రిజర్వేషన్లపై ఉన్నతన్యాయస్థానం సంచలన ప్రకటన చేసింది. బీసీ రిజర్వేషన్లను తప్పుపడుతూ ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశించింది. పాత పద్దతిలో ఎన్నికలను నిర్వహించుకోవాలని ఆదేశించినప్పటికి అప్పటికప్పుడు ఎన్నికల నిర్వహాణ సాధ్యం కాలేదు. ఆ తరువాత గత రెండు నెలల క్రితం పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం, ఆ తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణను తాత్కాలికంగా వాయిదా వేసింది. 

ఖమ్మం జిల్లాలో 20 జడ్పీటీసీ, 283 ఎంపీటీసీ స్థానాలు

ఖమ్మం జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉన్నాయి. 8,02,690 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 3,88,243 మంది పురుషులు, 4,14,425 మంది మహిళలు, 22 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. జిల్లాలో మొత్తం 1580 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  కాగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 283 ప్రాథమిక నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో జిల్లాలో 290కి పైగా స్థానాలు ఉండగా, కొన్ని మున్సిపాలిటీలో వెళ్లడంతో 283 ఎంపీటీసీ స్థానాలుగా ప్రభుత్వం గుర్తించి ప్రకటించింది.

అందులో బోనకల్లు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, చింతకానిలో 14 స్థానాలు, ఏన్కూరులో 10, కల్లూరులో 13, కామేపల్లిలో 12, ఖమ్మం రూరల్ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కొణిజర్లలో 15, కూసుమంచిలో 17, మధిరలో 12, ముదిగొండలో 17, నేలకొండపల్లిలో 18, పెనుబల్లిలో 15, రఘనాథపాలెంలో  సత్తుపల్లిలో 13, సింగరేణిలో 16, తల్లాడలో 16, తిరుమలాయపాలెంలో 18, వేంసూరులో 13, వైరాలో 10, ఎర్రుపాలెంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 

జులైలోనే ఎన్నికలు..? 

ఒక వైపు ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రీయ ప్రారంభించినప్పటికి ఏ నెలలో ఎన్నికలను నిర్వహిస్తారనే సందేహాలు నెలకొన్నాయి.. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ  సమయంలో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం దైర్యం చేయలేదు. అలాగే మే 11 నుంచి జూన్ 9 వరకు కేంద్ర ప్రభుత్వం జనగణన ప్రక్రియను తెలంగాణలో ప్రారంభిస్తుంది.. ఒక వైపు జనగణన జరుగుతుంటే, మరో వైపు ఎన్నికలను నిర్వహించే అవకాశం లేదు. దీంతో కచ్చితంగా మే, జూన్ నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశమే లేదు.

అయితే జులైలో వానాకాలం ప్రారంభం కావడం, వాతావరణం చల్లబడటం, చిరు జల్లులు కురిసే అవకాశం ఉండటం, ప్రజలందరు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు. అందుకే జులై మొదటి వారంలో లేదా.. రెండవ వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. వానాకాల ప్రారంభంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో జులై మాసంలోనే కచ్చితంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.. చూద్దాం ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో..?