అధికారుల్లో కదలిక..
- నోటీస్ బోర్డ్‌పై ఎంపిక జాబితా..
ఇంకా పూర్తికాని ఇండ్లు - మాత్రమే పంపిణీకి సిద్ధం
బెల్లంపల్లి, మార్చి 11 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక జాబితాపై ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. ‘ఇండ్ల పంపిణీ అటకెక్కినట్లేనా...? అనే శీర్షికతో ‘విజయక్రాంతి’ దినపత్రికలో బుధవారం వచ్చిన కథనం అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంలో అలసత్వం, లబ్ధిదారుల ఎంపిక ప్రమాణం తీరు, పంపిణీలో నిర్లక్ష్యం కోణం దిశగా వార్త కథనంతో ఒకసారి అధికారుల్లో అలజడి మొదలైంది. రమారమిగా ఎంపిక జాబితా, దాని పంపిణీ తీరు,
అభ్యంతరాలపై 7 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ, వాటిపై విచారణ, ఇత్యాది అంశాలను రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక జాబితాను తహసిల్దార్ కార్యాలయం నోటీసు బోర్డ్ పై అంటించారు. తొలివిడతలో చేపట్టిన 161 ఇండ్ల నిర్మాణంలో 108 మాత్రమే పూర్తయ్యాయి. వీటిని ఎంపిక చేసిన లబ్ధిదారులకు లక్కీ డ్రా ద్వారా అప్పగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
లబ్ధిదారులు ఎంపిక సామాజిక సమతుల్యత, ప్రమాణిక ప్రతిపాదికన జరిగిందని పేర్కొన్నారు. బెల్లంపల్లిలో గత ప్రభుత్వం మొత్తం 491 ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో ఎస్సీలకు 161, ఎస్టీలకు 14, ముస్లిం మైనార్టీ 91, క్రిస్టియన్ 1, బీసీ, అదర్స్ కు 213, ఓసీలకు 11 మందిలో 224 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో నిర్మాణం పూర్తి కావడాన్ని బట్టి దశల వారీగా లబ్ధిదారులకు ఇవ్వనున్నన్నట్టు అధికారులు వెల్లడించారు.
ప్రకటించిన మెత్తం ఇండ్లు నిర్మాణం పూర్తి కాలేదు. తొలివిడత అప్పగించే ఇండ్లు ఇంకా పూర్తి కాలేదు. 108 ఇండ్లు మాత్రమే పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అధికారుల్లో ఇండ్ల నిర్మాణంలో ఎంత నిర్లక్ష్యం ఉందో స్పష్టం అవుతున్నది. మొత్తానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సమగ్రతను అధికారులు బయటపెట్టారు. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.




