3 August, 2026 | 9:45 AM

బైరామల్‌గూడలో దారుణం.. రెండేండ్ల కూతురిని చంపిన తల్లి

03-08-2026 08:36 AM

బైరామల్‌గూడ చెరువులో ముంచి హత్య 

కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు 

ఎల్బీనగర్: తాగిన మైకంలో తల్లి సొంత కూతురిని కొట్టి, చెరువులో ముంచి హత్య చేసిన ఘటన ఎల్బీనగర్ లోని బైరామల్ గూడ చెరువు వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ఇంజాపూర్ లో నివాసం ఉంటున్న లోకసాని రాజేశ్వరి (34) రెండేండ్ల కూతురు అనురాధతో కలిసి నివసిస్తున్నది. కాగా, ఆదివారం సాయంత్రం రాజేశ్వరి తాగిన మత్తులో కూతురిని తీసుకుని ఎల్బీనగర్ లోని బైరామల్ గూడ చెరువు వద్దకు వచ్చింది. మత్తులో కూతురిని కొట్టి, చెరువులో ముంచి చంపింది. చెరువు సమీపంలో నివాసం ఉంటున్న కొందరు మహిళలు చూసి వెంటనే చెరువులో ఉన్న అనురాధ మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మత్తులో ఉన్న రాజేశ్వరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వినోద్ కుమార్ పేర్కొన్నారు.