15 March, 2026 | 2:43 PM

యాదాద్రి జిల్లాలో దారుణం.. కుటుంబ కలహాలతో కుమార్తె బలి

15-03-2026 11:36 AM

యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచి, తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఘటన భువనగిరి మండలం, తొక్కాపురం గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పలీసుల కథనం ప్రకారం... బీబీనగర్ మండలం జైనపల్లికి చెందిన బెజ్జంకి నరేంద్ర రెడ్డి, నీలిమ భార్యాభర్తలు. వీరికి కుమార్తె కృతిరెడ్డి(14), కుమారుడు అశాంత్ రెడ్డి(11) ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్నిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తల్లి నీలిమ తన ఇద్దరు పిల్లలను తీసుకొని తక్కుపురంలోని తల్లి ఇంటికి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు పిల్లలపై కత్తితో దాడి చేసి గొంతుకోసి అనంతరం ఆమె తమ ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ దాడి కుమార్తె కృతి అక్కడికక్కడే మరణించగా, కుమారుడు అంశాత్ రెడ్డి గాయాలతో తప్పించుకొని కేకలు వేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకొని గాయాలపాలైన ఆమె కుమారుడని, తల్లిని హుటాహుటిన భువనగిరిలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం నీలిమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కృతిరెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చురికి తరలించారు. నీలిమ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.