మెడికల్ కాలేజీకి అమ్మ శరీరం దానం
- మందమర్రిలో కుటుంబసభ్యుల ఆదర్శం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఆ అమ్మ చనిపోయింది. కన్నబిడ్డలు ఆమె పార్థివదేహాన్ని డప్పుచప్పుళ్లతో శ్మశానానికి తరలించారు. కానీ....శ్మశాన వాటికలో దహనం చేయలేదు. ఖననమూ చేయలేదు. పాడే దించి అంబులెన్స్ ఎక్కించారు. ఆ అంబులెన్సు ఆ అమ్మ విగత శరీరాన్ని మోసుకుని వైద్య విద్యార్థులకు పాఠ్యాంశంగా మారేందుకు వైద్య కళాశాలకు తరలించారు. ఈ సంఘటన మందమర్రిలో ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
వివరాల్లోకి వెళితే...
మంచిర్యాల జిల్లా మందమర్రిలో అశువులు బాసిన ఓ అమ్మ పార్దివదేహాహాన్ని కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీ కి దానం చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో మృతిచెందిన వెంటనే తొలుత సరోజినీ కంటి ఆసుపత్రి కి కళ్ళను దానం చేశారు. అంత్యక్రియల రోజు తమ తల్లి చెర్లపల్లి భారతీ పార్టివదేహాన్ని మెడికల్ కాలేజీ దానం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మందమర్రి పట్టణం అంగడి బజార్ ఏరియాకు చెందిన చర్ల పల్లి భారతీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది.
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెలన్నర రోజులుగా వైద్యం పొందుతున్నారు. ఆస్పత్రిలోనే గురువారం తుదిశ్వాస విడిచారు. చెర్లపల్లి రామస్వామి, భారతీ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కొడుకులు,ఇద్దరు కూతుళ్లు. కాగా పెద్దకుమారుడు కుమారస్వామి టీచర్, చిన్న కుమారుడు శ్రీధర్ ఫార్మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. రెండేళ్లు క్రితం తండ్రి రామస్వామి చనిపోయారు. అప్పటి నుంచి భారతీ భర్త మరణంతో మానసికంగా కుంగి, అనారోగ్యంతో మంచాన పడ్డారు.
అనారోగ్యం చేసినప్పుడల్లా హైదరాబాద్ ఆస్పత్రి కి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం నాడు మృతి చెందారు. వెంటనే హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి వారికి కళ్ళను దానం చేశారు.అనంతరం మందమర్రి స్వగృహానికి తీసుకువచ్చి,బంధుమిత్రుల సందర్శనార్థం ఉంచారు.శుక్రవారం నాడు భారతి పార్థివ దేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు.
ఈ సందర్భంగా మెడికల్ కళాశాల వైద్యులు మాట్లాడారు. పార్ధీవదేహాన్ని వైద్య విద్యార్థులు ప్రాక్టికల్ ప్రయోగంతో వారిలో వైద్య ఙ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. విద్య రంగంలో సుశిక్షితులు గా రాణిస్తారని తెలిపారు. కుమారస్వామి, శ్రీధర్ తమ తల్లి భారతమ్మ శరీరాన్ని ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీకి అప్పగించడం పట్ల రుణపడి ఉంటామన్నారు. తమ తల్లి పార్ధీవదేహాన్ని దానం చేసి అందిరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.






