జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!
ల్యాబ్ సిబ్బంది లేక రోగుల పడుతున్న ఇబ్బందులు
ఖాళీ కుర్చీ దర్శనం.. పరీక్షల కోసం రోగుల నిరీక్షణ
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల లోపం.. ప్రైవేట్ వైపు ప్రజల పరుగులు
నెల రోజులుగా రక్త పరీక్షలు నిలిచిపోయాయా..?
వైద్య సేవల్లో నిర్లక్ష్యం.. చర్యలు ఎప్పుడు..?
ఉచిత వైద్యం కోసం వస్తే.. అదనపు ఖర్చుల భారం
రోగుల ఆవేదన: సిబ్బంది కొరతకు చెక్ పెట్టాలి
ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందక ప్రజల్లో అసంతృప్తి
జిన్నారం/అమీన్ పూర్: జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించే సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల రోజులుగా రక్త పరీక్షలు నిర్వహించే ఉద్యోగి విధులకు హాజరు కావడం లేదని, దీంతో ల్యాబ్ సేవలు సక్రమంగా అందడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు. వైద్యులు పలు రకాల రక్త పరీక్షలు సూచించినప్పటికీ, పరీక్షలు నిర్వహించే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే ఉద్యోగి సెలవులో ఉన్నారని లేదా ఆసుపత్రి పనుల నిమిత్తం బయటకు వెళ్లారని సమాధానం చెబుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. దీంతో అత్యవసరంగా పరీక్షలు చేయించుకోవాల్సిన వారు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని, అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఉచిత వైద్యం కోసం వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుని, ల్యాబ్ సేవలు నిరంతరంగా అందేలా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.






