పెయిడ్ సర్వీస్‌పై పెత్తనం!
- ఈఎస్‌ఐపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ
- సొమ్ము లబ్ధిదారులది.. సోకు ప్రభుత్వాలది
- డిస్పెన్సరీల్లో కనీస వసతులు కరువు
- లబ్ధిదారుల నుంచి ఏటా రూ.2 వేల కోట్ల వరకు వాటాగా కేంద్రానికి చెల్లింపు
- కేంద్రం ఏటా ఖర్చుచేసేది రూ.500 కోట్లే
- ఈఎస్‌ఐకి వచ్చే నిధులను దారి మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఉద్యోగుల భర్తీ లేదు.. కనీస సౌకర్యాలు శూన్యం
- ఈఎస్‌ఐ లబ్ధిదారులు పట్టని ఇరు ప్రభుత్వాలు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో సుమారు 26 లక్షల మం ది కార్మికులు, చిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులకు ఇందులో సభ్యత్వం ఉంది. వారి కుటుంబసభ్యులతో కలిపి చూసుకుంటే సుమారు కోటి మంది ఉంటారు. కార్మికులు, చిరుద్యోగులు చెమటోడ్చి సంపాదిం చే జీతాల నుంచి తమ ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రతినెలా కొంత కొంత చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా వారు పనిచేసే సంస్థలు, కంపెనీలు, యాజమాన్యాలు కూడా ఇతోధికంగా ఉద్యోగుల తరఫున కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాయి.
ఇలా జమైన మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటున్న కేంద్ర ప్రభు త్వం.. కార్మికులు, చిరుద్యోగుల సంక్షేమం, వారి ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం కూడా కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా తయారయ్యింది. కేంద్రం ఇచ్చే అరకొర నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించుకుంటూ లబ్ధిదారులైన చిరు ద్యోగులు, కార్మికులకు డిస్పెన్సరీలను అం దుబాటులో ఉంచడంలేదు.
కనీస వసతులను విస్మరిస్తున్నది. కావాల్సిన ఉద్యోగు లను భర్తీ చేయడం లేదు. కుర్చీలు ఉంటే బెంచీలు ఉండటం లేదు. మందులు ఉంటే ఫార్మాసిస్ట్‌లు ఉంటలేరు.. అన్నీ ఉంటే వైద్యు లు ఉండటంలేదు. డిస్పెన్సరీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని విధంగా వ్యవహరిస్తున్నది.
ఇదంతా ఎవరి గురించి అను కుంటున్నారు.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) లబ్ధిదారుల గురించి. నిజం గా చెప్పాలంటే.. ‘పెయిడ్ సర్వీస్’ అయిన ఈఎస్‌ఐలో అందుతున్న సేవలు, డిస్పెన్సరీల్లో వసతులను పరిశీలిస్తే.. అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా ఎలాంటి నిధులను ఖర్చు చేయకుండా కార్మికులు, చిరుద్యోగుల జీతాల నుంచి సేకరిస్తున్న నిధులపై అజమాయిషీ చేయడ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
కోటి మందికి సేవలు..
కేంద్ర కార్మిక శాఖ పరిధిలో ఉండే ఈఎస్‌ఐ నిబంధనలు చూసుకుంటే ప్రతినెలా రూ.25 వేల జీత భత్యాలు సంపాదించే చిరుద్యోగులు, కార్మికులు అందరూ ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తారు. చిన్నపాటి వ్యాపార సం స్థలు, కంపెనీలు, దుకాణాలు, షాపులు, షోరూంలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు.. ఇలా వేల సంస్థలు ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో మొత్తం 26 లక్షల మంది ఈఎస్‌ఐకి లబ్ధిదారులుగా ఉన్నారు.
వీరి కుటుం బాల్లోని సభ్యులను పరిగణలోకి తీసుకుంటే సుమారు కోటి మందికిపైగా ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తారని అధికారవర్గాల సమాచా రం. వాస్తవానికి ఈఎస్‌ఐ కేంద్ర, రాష్ట్ర నిధులతో నడవడం లేదు. కార్మికులు, చిరుద్యో గుల జీతభత్యాల నుంచి, వారు పనిచేసే యాజమాన్యాలు చెల్లించే మొత్తంతోనే ఈఎస్‌ఐని నిర్వహిస్తున్నారు. అంటే ఇది పెయిడ్ సర్వీస్.. ప్రభుత్వం కేవలం నిర్వహణ మాత్ర మే చూసుకుంటుంది.
సేవలు సరిగ్గా అందే లా అజమాయిషీ చేయాలి. కానీ ఇక్కడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు, అసంతృప్తి లబ్ధిదారుల నుంచి వస్తున్నది. ఇందుకు ప్రధాన కార ణం.. తమ నుంచి వసూలు చేసిన నిధులను కూడా కేంద్రం పూర్తిగా ఖర్చు చేయడం లేద ని.. వచ్చిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు, పథకాలకు ఉపయోగించుకోవడంతో తమ డబ్బులతో ఏర్పాటుచేసిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు కునారిల్లుతున్నాయ ని, తమకు సరిగా సేవలు అందించడం లేదంటూ వాపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు.
ఏటా సుమారు రూ.2 వేల కోట్లు..
ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే ప్రతి లబ్ధిదారుని జీతభత్యాల నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఈఎస్‌ఐకి జమచేస్తారు. అలాగే కార్మికులు, చిరుద్యోగులు పనిచేసే సంస్థలు కూడా కొంత మొత్తాన్ని ఈఎస్‌ఐకి జమచేస్తాయి. ఒక ఈఎస్‌ఐ చందాదారుడుకి వచ్చే జీతంలోని ప్రతి రూ.100లకు రూ.1.75 పైస ల చొప్పున ఈఎస్‌ఐ చందాగా వసూలుచేస్తారు.
సదరు చందాదారునికి జీతం చెల్లించే సంస్థ నుంచి ప్రతి రూ.100లకు రూ.3.50 పైసల చొప్పున చందాకు జమచేస్తారు. రాష్ట్రంలోని 26 లక్షల మంది లబ్ధిదారుల నుంచి, వారి కంపెనీల నుంచి వసూలు చేసే మొత్తం నెలకు సుమారు రూ.165 కోట్లకుపైగా ఉంటుంది. అంటే ఏటా జమచేసే మొ త్తం సుమారు రూ.2,000 కోట్లకు కాస్త అటూఇటూగా ఉంటుంది. ఈ మొత్తం కేం ద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్‌ఐ విభాగానికి జమవుతున్నది.
కేటాయింపు ఏటా రూ.780 కోట్లే..
కేంద్రం ప్రతి లబ్ధిదారునికి ఏటా రూ.3 వేల వరకు కేటాయిస్తున్నది. ఈ లెక్కన ఏటా రూ.780 కోట్ల వరకు కేంద్రం నిధులను ఖర్చు చేస్తుందన్నమాట. అయితే ప్రస్తుతానికి ఏటా కేంద్రం తెలంగాణలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, ఆసుపత్రుల కోసం రూ.500 కోట్ల వరకు మాత్రమే ఖర్చుచేస్తున్నది. ఇం దులోంచి రాష్ట్రానికి రూ.250 కోట్లను కేం ద్రం ఇస్తున్నది.
ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి, మెడికల్ కళాశాల లాంటివాటిని కేం ద్రంలోని కార్మిక శాఖ నేరుగా నిర్వహిస్తున్న ది. ఇందుకు మరో రూ.250 కోట్ల వరకు ఖ ర్చు పెడుతున్నది. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే రూ.250 కోట్లతో ఈఎస్‌ఐ ఆసు పత్రులు, డిస్పెన్సరీలకు కావాల్సిన మందు లు, వాటి నిర్వహణ, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల ఫించన్లకు ఖర్చు పెడుతున్నారు.
రాష్ట్ర నిర్వహణ నిస్తేజం
వాస్తవానికి కేంద్రం నుంచి రూ.780 కోట్ల వరకు నిధులను తెచ్చుకునే అవకాశం రాష్ట్రానికి ఉన్నది. కానీ ఆ స్థాయిలో డిస్పెన్సరీల నిర్వహణ, ఉద్యోగుల భర్తీ చేయకపో వడంతో కేంద్రం రూ.250 కోట్లతోనే సరిపెడుతున్నది. పైగా కేంద్రం నుంచి వచ్చే రూ. 250 కోట్లను రాష్ట్రం ఇతర పథకాలకు మళ్లి స్తూ.. ఈఎస్‌ఐకి నిధుల ఖర్చులో జాప్యం చేస్తున్నది. ఇదే తరహాలో వ్యవహరించినందుకు గతంలో సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని మందులు, డ్రగ్స్ సరఫరాదారుల అసోసియేషన్ తీసుకెళ్లడంతో మొట్టికాయ లు పడ్డాయి.
అప్పటికి ఈ వివాదం పరిష్కారం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవ హారంలో మార్పు రాలేదు. తాజాగా రాష్ట్రం మరో ఎత్తుగడకు ప్రణాళిక వేసినట్టుగా ఈఎస్‌ఐ ఉద్యోగులు, అధికారులు చర్చించుకుం టున్నారు. ఏటా కేంద్రం నుంచి రూ.780 కోట్ల వరకు నిధులను తీసుకొచ్చేలా డిస్పెన్సరీలు, ఆసుపత్రు ల నిర్వహణను మెరుగు పరిచినట్టుగా చూపిస్తే..
వచ్చే నిధులను ఇతర అవసరాలకు మళ్లించుకోవచ్చనే పథకాన్ని కొందరు ఈఎస్‌ఐ ఉన్నతాధికారులే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు నూరిపోశారనేది సమాచా రం. అందులో భాగంగానే తాజాగా 26 డిస్పెన్సరీల విభజన, ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు.. ప్రతి డిస్పెన్సరీ మధ్య కనీసం 5 కిలోమీటర్ల దూరం ఉండాలని అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఈఎస్‌ఐ
ఈఎస్‌ఐ లబ్ధిదారులు, కంపెనీల నుంచి ఏటా కేంద్రానికి రూ.2 వేల కోట్ల వరకు వెళుతున్నా నిర్వహణను మాత్రం కేంద్రం సరిగ్గా పట్టించుకోవడంలేదని లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఏటా రూ. 780 కోట్లు.. అంటే తాము చెల్లించేదానిలో సగం కంటే తక్కువ నిధులను కేంద్రం కేటాయిస్తున్నా అదికూడా పూర్తిగా ఖర్చు పెట్ట డం లేదని.. దీంతో క్షేత్రస్థాయిలో ఈఎస్‌ఐ వైఫల్యానికి దారితీస్తున్నదని పేర్కొంటున్నారు.
నిర్వహణ మీరు చూసుకొండి.. నిధు లు మేము ఇస్తామని కేంద్రం చెబుతున్నదని.. అయితే కేంద్రం ఇస్తున్న నిధులు.. తా ము చెల్లిస్తున్న దాంట్లో సగంకూడా ఉం డటం లేదని చెప్తున్నారు. పైగా కేంద్రం నుం చి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించడం లేదని.. డిస్పెన్సరీలు, ఆసుపత్రుల నిర్వహణ సరిగా లేదని, వసతుల కొరత స్పష్టంగా కనపడుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో ఇరు ప్రభు త్వాల మధ్య ఈఎస్‌ఐ నలిగిపోతున్నదని ఆవేదన చెందుతున్నారు.
సొమ్ము కార్మికులది.. లబ్ధి ప్రభుత్వాలకు..
నిజానికి ఈఎస్‌ఐ మొత్తం లబ్ధిదారులు, వారి కంపెనీల నుంచి వచ్చే చం దాతోనే నడుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు సొంతంగా ఎలాంటి నిధులను కేటాయించడం లేదు. పైగా ఈ నిధులనే ఇరు ప్రభుత్వాలు సొంత అవసరాలకు వాడుకుంటున్నాయి. సాధార ణ ప్రజలకు వైద్య సేవలు అందించాలంటే ప్రభు త్వం బడ్జెట్‌లోనే నిధులను కేటాయించాలి. కానీ ఇక్కడ లబ్ధిదారుల నుంచి వ సూలు చేసిన నిధులను ఖర్చుచేసి డిస్పెన్సరీలు, అసుపత్రులను సరిగా నిర్వ హించేందుకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేకపోవడాన్ని లబ్ధి దారులు గర్విస్తున్నారు.
కార్మిక చట్టం, నిబంధనలను సాకుగా చూపి తమ నుం చి డబ్బులు వసూలు చేసి.. ఆదాయం గా మార్చుకోవడం తప్పితే.. రాష్ట్ర జనాభాలో పావు శాతంగా ఉన్న తమ ఆరో గ్యం, సంక్షేమం పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని వాపోతున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలను పూర్తి వసతులతో, సౌకర్యాలతో, మందులు, డ్రగ్స్ సరిపోయినంతగా సరఫరా చేసినా.. తా ము సమకూర్చే సొమ్ములో ఇంకా నిధు లు మిగులుతాయని లబ్ధిదారులు పే ర్కొంటున్నారు. పూర్తి పెయిడ్ సర్వీసులను సరిగా అందించకుండా.. కేవలం పెత్తనం కోసమే ప్రభుత్వా లు పాకులాడుతుంటే ఎవరితో చెప్పుకోవాలని ఈఎస్‌ఐ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
పరస్పర ఆరోణల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కేవలం రూ.250 కోట్లే రాష్ట్రానికి తిరిగి వస్తుండటంతో ప్రభుత్వానికి ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల నిర్వహణ కష్టమవు తున్నదని, నిధులు పెంచాలని రాష్ట్రం కోరుతున్నది. ఉద్యోగులను తామే భర్తీచేసి, జీతభ త్యాలు తామే చెల్లించాల్సి రావడంతో ఈఎస్‌ఐ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి రోజు రోజుకు ఆసక్తి సన్నగిల్లుతున్నది. అదే సమయంలో నిర్వహణ మెరుగుపడితే తాము నిధులు ఇస్తామని కేంద్రం పేర్కొంటున్నది.
అంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే తప్ప అసలు డబ్బులు చెల్లిస్తున్న తమను పట్టించుకోవడం లేదంటూ లబ్ధిదారులు అంటున్నారు. అదే సమయంలో ఏటా రూ.2 వేల కోట్ల వరకు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్మిక సం క్షేమ శాఖ.. ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రిని, మెడికల్ కళాశాలను మాత్రమే నిర్వ హిస్తూ చేతులు దులుపుకుంటున్నది.
దీంతో నిధులు వెళ్లేది కేంద్రానికి.. మొత్తం డిస్పెన్సరీలు, ఆసుపత్రులను చూసుకోవాల్సిన బాధ్యత తమకెందుకనే ధోరణితో.. మెల్లమెల్లగా ఈఎస్‌ఐ నిర్వహణ నుంచి రాష్ట్ర ప్రభు త్వం తప్పుకోవాలని చూస్తున్నది. కేంద్రం నుంచి వచ్చే రూ.250 కోట్లతో అరకొర మందులను అందిస్తూ.. డిస్పెన్సరీలు, ఆసుపత్రులను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న ది. దీంతో ఈఎస్‌ఐ పరిస్థితి రెంటికీచెడ్డ రేవడిలా తయారయ్యింది.






