13 March, 2026 | 12:30 PM

మొబిలిటీ ప్లాన్@2050

13-03-2026 12:00 AM
  1. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం కోసం రూ.4 లక్షల కోట్ల ప్రణాళిక
  2.   19,352 -కి.మీ.ల రోడ్ల అభివృద్ధి
  3. ట్రాన్సిట్ ఫస్ట్ విధానమే అజెండా: ఎన్‌వీఎస్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. 2050 నాటి మెట్రోపాలిటన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సమగ్ర మొబిలిటీ ప్లాన్‌పై గురువారం మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో హోటల్ తాజ్ వివాంటాలో కీలక వర్క్‌షాప్ నిర్వహించారు.

రూ. 4 లక్షల కోట్ల అంచనా వ్యయం తో కూడిన బృహత్ ప్రణాళికను అధికారు లు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైలు నెట్వర్క్‌ను ప్రస్తుత స్థాయి నుంచి 2050 నాటికి ఏకంగా 556.6 కిలోమీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. 2030 నాటికి 258 కి.మీ, 2040 నాటికి 534 కి.మీ మేర మెట్రో అందుబాటులోకి రానుంది. అదేవిధంగా ఎంఎంటీఎస్ నెట్వర్క్‌ను 336.4 కిలో మీటర్ల మేర విస్తరించనున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాన్సిట్ ఫస్ట్ విధానంలో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీకి, మెట్రో రెండో దశ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2,847 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు, హైవే లు ఆర్టీరియల్ కారిడార్లను ప్రతిపాదించా రు. ఇది 2050 నాటికి 19,352 లేన్ కిలోమీటర్లకు చేరుకుంటుంది. మూసీ నదిపై 29 కొత్త వంతెనలను నిర్మించనున్నారు.

పాదచారుల భద్రత కోసం 120 స్కైవాక్‌లు, వాహనాల రాకపోకల కోసం 75 గ్రేడ్ సెపరేటర్లు, 8 ఎలివేటెడ్ రోడ్లు, 34 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ,16 అండర్ బ్రిడ్జిలను ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ, హైదరాబాద్‌ను బెంగళూరు అమరావతి చెన్నై నగరాలతో కలిపే హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రాముఖ్యతను వివరించారు.

ట్రాఫిక్ జాయింట్ కమి షనర్ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ, 2050 వరకు 7 అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్స్, ట్రక్ టెర్మినల్స్ ఏర్పాటు చేయడం ద్వారా భారీ వాహనాల రద్దీని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ మౌలిక సదు పాయాల కల్పనకు 2050 నాటికి సుమారు 4 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమని ఎల్‌ఈఏ అసోసియేట్స్ ప్రతినిధి డా. ఎం.పి. రాజు వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.