రైతు మృతిపై సంతాపం తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం
కుటుంబానికి రూ.2 లక్షల ప్రభుత్వ సహాయం, రూ.50 వేల వ్యక్తిగత ఆర్థిక సాయం
చిట్యాల,(విజయక్రాంతి): కొయెడలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు హాజరై తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి చెందిన రైతు పప్పుల ఎల్లయ్య మృతిపై ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన రైతు పప్పుల ఎల్లయ్య శనివారం కొయెడలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు హాజరై తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే మృతుడి నివాసానికి వెళ్లి ఎల్లయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. అలాగే మానవతా దృక్పథంతో తన వ్యక్తిగత సహాయంగా రూ.50 వేల నగదు అందించి కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎల్లయ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.






