1 August, 2026 | 10:16 PM

కేటీపీపీలో టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో 35వ రోజు నిరసన

01-08-2026 09:21 PM

గణపురం,(విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని ఏ హెచ్ పి, సి హెచ్ పి విభాగాల ప్రైవేటీకరణ టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో కేటీపీపీ ప్రధాన గేటు వద్ద 35వ రోజు శనివారం రిలే నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన సమయంలో లాభాల్లో ఉన్న విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించడం ఉద్యోగుల భవిష్యత్తుకు, సంస్థ అభివృద్ధికి తీవ్ర నష్టం కలిగిస్తుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేటీకరణ టెండర్‌ను వెంటనే రద్దు చేసి, పనులను శాశ్వత ఉద్యోగులతోనే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీజీపీఈజేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీజీపీఈజేఏసీకి చెందిన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంజినీర్లు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.