అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
1990 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన 1990 మంది విద్యార్థులకు (1532 మంది అండర్ గ్రాడ్యుయేట్, 372 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్, 86 మంది పీహెచ్.డీ. స్కాలర్లు) పట్టాలు ప్రదానం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా, గీతం అధ్యక్షుడు-విశాఖపట్నం లోక్ సభ సభ్యుడు శ్రీ ఎం. శ్రీభరత్ అధ్యక్షత వహించారు. విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా మహాత్మా గాంధీ విగ్రహానికి, గీతం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా, చేనేత రంగంలో విశేష కృషి, భారతదేశపు గొప్ప వస్త్ర వారసత్వాన్ని పరిరక్షించడంలో అందించిన సేవలకు గుర్తింపుగా, భారతీయ చేనేత కళాకారుడు శ్రీ గజం గోవర్ధనకు గీతం గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేసింది.
విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొత్తం 17 బంగారు పతకాలను అందజేశారు. బీ.టెక్.లోని అన్ని విభాగాలలో టాపర్ గా నిలవడంతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు సాధించిన డిగుదాడి ప్రణవ్ రాహుల్ ప్రెసిడెంట్ పేరిట నెలకొల్పిన రెండు బంగారు పతకాలను అందుకున్నారు. అలాగే, పరిశోధన, ఆవిష్కరణల రంగంలో గణనీయమైన కృషి చేసిన 86 మంది పరిశోధక విద్యార్థుల (పీహెచ్.డీ. స్కాలర్లు)కు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేసింది.
అత్యుత్తమ పరిశోధన విజయాలకు గాను, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (అర్థశాస్త్ర విభాగం) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ అర్షద్ అన్సారీ, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ (రసాయన శాస్త్ర విభాగం) ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్రబాబులకు ‘ఉత్తమ పరిశోధకుడు’ (బెస్ట్ రీసెర్చర్) అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ రాజమౌళి స్నాతకులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన, ఆలోచింపజేసే ప్రసంగం చేశారు. డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి తత్వాన్ని గుర్తుచేస్తూ పట్టభద్రులను ఉత్తేజపరిచారు. అచంచలమైన అంకితభావం, అభిరుచి, కఠోర శ్రమ ద్వారా తాము ఎంచుకున్న రంగాలలో శ్రేష్ఠతను సాధించాలని సూచించారు. ప్రతి ప్రయత్నాన్ని నిబద్ధతతో, లక్ష్యంతో కొనసాగించాలని ఆయన పట్టభద్రులను ప్రోత్సహించారు.
తన అధ్యక్షోపన్యాసంలో, శ్రీభరత్ పట్టభద్రులైన విద్యార్థులు అభినందిస్తూ, విజయానికి ఏడు మార్గదర్శక సూత్రాలను వివరిస్తూ రాజమౌళి గారి సందేశాన్ని పునరుద్ఘాటించారు. పెద్ద కలలు కనండి, మిమ్మల్ని మీరు నమ్మండి, గొప్ప వ్యక్తులతో కలిసి ఉండండి. మీ లక్ష్యాల పట్ల అభిరుచితో నిబద్ధతతో ఉండండి. నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉండండి. వినయంగా ఉండండి, ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ నిలబెట్టుకోండి అని సలహా ఇచ్చారు.
వార్షిక నివేదికను సమర్పిస్తూ, హైదరాబాదులో అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, గీతం సాధించిన విజయాలను వివరించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలలో శ్రేష్ఠత ద్వారా సామాజిక బాధ్యత గల నాయకులను తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. పట్టభద్రులైన విద్యార్థులు నైతిక ప్రవర్తన, వృత్తిపరమైన నైపుణ్యం, దేశ నిర్మాణానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ స్నాతకోత్సవ ప్రతిజ్జ చేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్ వందన సమర్పణ చేశారు.
17వ స్నాతకోత్సవ కార్యక్రమం, విద్యాపరమైన నైపుణ్యం, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి పట్ల గీతం హైదరాబాదు అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబించింది. ఈ కార్యక్రమం ద్వారా పట్టభద్రులైన వారు బాధ్యతాయుతమైన నిపుణులుగా, సమాజంపై అర్థవంతమైన ప్రభావాన్ని చూపగల భవిష్యత్ నాయకులుగా ఎదిగేలా సాధికారత కల్పించింది.






