కమిషన్ల కక్కుర్తితో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ
మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముకరంపుర,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు ప్రాజెక్టు వల్లనే నీళ్లు వస్తున్నాయన్న విషయం మరో సారి రుజువైందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను ఆసరా చేసుకొని మేడిగడ్డ నుండి నీళ్లు పంపు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నాలు చేశారని కమీషన్ల కక్కుర్తి తోటి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ మచ్చను ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్ర పన్నారని అన్నారు.
లక్ష కోట్లు ఖర్చు పెట్టీ కట్టిన మేడిగడ్డ బ్యారేజి ఏనాడు పనికి రాలేదని అన్నారు. ఆనాడు ఇందిరా చౌక్ సుందరీకరణ కు కోటి ఎనభై లక్షలు వెచ్చిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ ముందున్న జ్యోతిభా ఫూలే చౌక్ సుందరీకరణ పద్దెనిమిది లక్షలతో చేశామని గుర్తు చేశారు.ఈ విలేఖరుల సమావేశంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కుర్ర పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.






