11 July, 2026 | 1:30 AM

గాయత్రినగర్ గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

11-07-2026 12:34 AM

బడంగ్‌పేట్, జూలై 10 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్‌ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ మీర్పేట్ గాయత్రి నగర్లో రూ.98 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. 2023లో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ఇప్పటికి పూర్తి కాకపోవడంపై మండిపడ్డారు.

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యదర్శికి గ్రంథాలయానికి అవసరమైన ఫర్నిచర్, పుస్తకాలు, కంప్యూటర్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రతతో పాటు అన్ని మౌలిక వసతులను అత్యవసరంగా కల్పించాలని ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయిన వెంటనే గాయత్రి నగర్ గ్రంథాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్కల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, శ్రీను నాయక్, బాల్రాజ్, మాధవి తదితరులు పాల్గొన్నారు.