17 June, 2026 | 1:22 AM

రూ.1.20 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జారె శ్రీకారం

17-06-2026 12:09 AM

ప్రభుత్వ పాఠశాలలు బలపడితేనే పల్లె పిల్లల భవిష్యత్తు బంగారుమయం 

దమ్మపేట, జూన్ 16, (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో రూ.1,20,80,000 విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, రవాణా, చిన్నారుల సంక్షేమ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన ఈ కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధికి దోహదపడనున్నాయన్నారు.

అంకంపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కొడిసెలగూడెంలో టిడబ్ల్యూయూపీఎస్ పాఠశాలలో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. అనంతరం పట్వారిగూడెం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన ఎనిమిది సీసీ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. బాలరాజుగూడెం గ్రామపంచాయతీ, దిబ్బగూడెం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడను, మెండివర్రి గ్రామంలో రూ.11.80 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు.

నాగుపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన ఆధునిక అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించి, చిన్నారుల విద్య, పోషకాహారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తొట్టిపంపు గ్రామంలో ఎంపీయూపీఎస్ పాఠశాలకు రూ.10 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను, లింగాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొర్రెగుట్ట గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడలను ప్రారంభించారు.

మారప్పగూడెం గ్రామపంచాయతీ కొత్తూరులో రూ.8 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని, పాత చీపురుగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.10 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభోత్సవం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు బలపడితేనే పల్లె పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను అందుకోవాలనే లక్ష్యంతో  ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.