28 February, 2026 | 7:56 PM

కళ్యాణ లక్ష్మి చెక్కులు అందచేసిన ఎం ఎల్ ఎ జారే

28-02-2026 01:09 PM

పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న రేవంత్ ప్రభుత్వం -ఎమ్మెల్యే జారె

దమ్మపేట,(విజయక్రాంతి): శనివారం గండుగలపల్లి క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana) రూ.88,10,208/- ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు లతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి  కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సహాయం అందించి భారం తగ్గిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు  అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందని, స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే వారి కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అదేవిధంగా బాల్యవివాహాలపై ఆయన  మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు.

చట్టపరంగా నిర్దేశించిన వయస్సు (18 సంవత్సరాలు) వచ్చిన తర్వాత మాత్రమే వివాహాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాలు చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చట్టాలను గౌరవిస్తూ తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి, కాంగ్రెస్ నాయకులు రావు గంగాధర్ రావు, ఎర్రా వసంతరావు, వంకా జానకిరాముడు, కూరం అర్జునరావు, ఎమ్మార్వో రామ్ నరేష్, ఆర్ఐలు బిక్షమయ్య, వీరాస్వామి, జూనియర్ అసిస్టెంట్ అలీ,  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.