నేషనల్ హ్యాండ్‌బాల్‌కు ఎంపికైన విద్యార్థినులకు ఎమ్మెల్యే అభినందనలు.
చిట్యాల,ఏప్రిల్ 27(విజయక్రాంతి): నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్రానికి చెందిన విద్యార్థినులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందించారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్రానికి చెందిన విద్యార్థినులను ఆయన ప్రత్యేకంగా కలుసుకుని, దేశ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని కోరారు. విద్యార్థినుల ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.






