1 April, 2026 | 10:25 PM

ప్రభుత్వ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

01-04-2026 08:33 PM

- మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్ 

గజ్వేల్: ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన సెట్విన్ ద్వారా తక్కువ ఖర్చుతో అందిస్తున్న స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్ సూచించారు. గజ్వేల్ పట్టణంలో సెట్విన్ సంస్థ ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అతి తక్కువ ఖర్చుతో యువతకు అందిస్తున్న వివిధ కోర్సుల నైపుణ్య శిక్షణ కరపత్రాలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో కమీషనర్ వెంకట గోపాల్, పాలకవర్గంతో కలిసి ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చైర్పర్సన్ చందన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ యువజన సేవల శాఖలో భాగమైన సెట్విన్ సంస్థ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక చొరవతో  గజ్వేల్ లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గజ్వేల్ ప్రాంత యువతి యువకులు అన్ని రంగాల్లో ముందుండాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని సూచించారు. సెట్విన్ ఇంచార్జ్ ఖదీర్ మాట్లాడుతూ  గజ్వేల్ సెట్విన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఉద్యోగానికి అవసరమయ్యే విధంగా కంప్యూటర్ కోర్సులతోపాటు, స్వయం ఉపాధి కోర్సులను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తమ శిక్షణ సంస్థ ద్వారా  ఎంఎస్ ఆఫీస్, డిటిపి, పిపిటిటిసి( ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్), మగ్గం (జర్దోజీ), గార్మెంట్ మేకింగ్, మెహందీ డిజైనింగ్, బ్యూటీషియన్, రిఫ్రిజిరేటర్ & ఏ/సి రిపేర్, ఎలక్ట్రీషియన్, IP CCTV కెమెరా ఇన్స్టాలేషన్ కోర్సులను అతి తక్కువ ఫీజులతో శిక్షణ ఇవ్వడంతో పాటు టెక్నికల్ బోర్డు ఆమోదిత సర్టిఫికెట్లను అందించడం జరుగుతుందన్నారు. గజ్వేల్ ప్రాంత యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు గజ్వేల్ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని గాని,  8790810172 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని కోఆర్డినేటర్ ఖదీర్ సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.