08-02-2026 12:01:34 AM
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం
బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే చెత్తబుట్టలో పడినట్టే
కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాల్టీల్లో ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్
కోరుట్ల, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచి, క్లీన్ స్వీప్ చేయబోతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని విమర్శించారు. ము న్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 120 మున్సిపాలిటీలు కార్పొరేషన్ లకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాం గ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు.
కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. కోరుట్ల పట్టణం అన్ని రంగాల్లో వెనుకపడిపోవడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. ఓటును చేతి గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ, హైదరాబాదులో రేవంత్‌రెడ్డి, కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగరావు పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి, సంక్షేమ కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి అత్యధిక నిధులు ఇప్పించే బాధ్యత నాదేనన్నారు.
ఇటీవలే కోరుట్ల నియోజకవర్గానికి 18 కోట్ల 70 లక్షల నిధులు మంజూరు చేశామని, ఆ నిధుల ద్వారా సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఇరిగేషన్, సివిల్ సప్లై విషయంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభు త్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు.