గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి
కల్వచర్ల లో కార్డెన్ సర్చ్ లో మంథని సిఐ రాజు
రామగిరి,(విజయక్రాంతి): గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు 100కు డయల్ చేయాలని మంథని సిఐ రాజు ప్రజలకు సూచించారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు గ్రామంలోని ఇళ్లను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. 08 నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజు గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరాల బారిన పడితే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ప్రతి ఇంటికి కెమెరాల ఏర్పాటు అవసరమని తెలిపారు.
గంజాయి, వ్యసనాలు
గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. భూ కబ్జాలకు పాల్పడినా, అమాయకులను మోసం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఐకమత్యంతో, శాంతియుతంగా ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సీఐ పేర్కొన్నారు. నేర రహిత సమాజం కోసం ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎస్ఐ తాడవేని శ్రీనివాస్, ముత్తారం ఎస్ఐ రవి కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






