ఉప్పొంగిన అభిమానం
చేతిపై మంత్రి శ్రీధర్ బాబు పచ్చ బొట్టు
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్ల తనకున్న అమితమైన అభిమానాన్ని ఒక అభిమాని వినూత్నంగా చాటుకున్నారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా, తన చేతిపై శ్రీధర్ బాబు గారి ముఖచిత్రాన్ని పచ్చబొట్టుగా (టాటూ) వేయించుకున్నారు. ఈ టాటూ అత్యంత స్పష్టంగా, చూడముచ్చటగా ఉండటం విశేషం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామానికి చెందిన అల్లాడి రఘునాథ రావు మంత్రి శ్రీధర్ బాబు వీరాభిమాని.
చాలా ఏళ్లుగా మంత్రి అనుచరుడిగా ఉన్న రఘు ఈ సారి పుట్టిన రోజు సందర్భంగా తన ప్రత్యేకతను చాటుకోవాలని పచ్చ బొట్టు వేసుకొని అభిమానాన్ని చాటుకున్నాడు.తన ఆరాధ్య నాయకుడి పట్ల ఈ అభిమాని ప్రదర్శించిన భక్తి, కృతజ్ఞత ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సాధారణంగా నాయకులపై అభిమానాన్ని బ్యానర్లు, కటౌట్లతో చూపిస్తుంటారు, కానీ ఇలా శాశ్వతంగా తమ శరీర భాగంపై గుర్తుగా వేయించుకోవడం ద్వారా తన ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని చూసి పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అభిమానిని అభినందిస్తున్నారు






